“వయసు 57 అయితే ఏంటంట?. నా కష్టానికి, నా కలలకు ఇంకా వయసు కాలేదు”.. చిరిగిన ఫోల్డర్‌తో ఉద్యోగం కోసం బయల్దేరిన మహిళ.. నెటిజన్ల మనసును హత్తుకుంటున్న వీడియో.!

57 ఏళ్ల ఓ మహిళ చేతితో రాసిన తన బయోడేటాను చిరిగిపోయిన పాత ఫోల్డర్‌లో పెట్టుకుని ఉద్యోగం కోసం వెతుకుతున్న దృశ్యం సోషల్ మీడియాలో విపరీతంగా వైరలవుతోంది.

57 ఏళ్ల వయసులో కూడా తనకంటూ ఓ సరికొత్త ప్రారంభాన్ని, ఉపాధిని వెతుక్కుంటున్న ఆమె ప్రయత్నం.. “కలలకు వయోపరిమితి ఉండదు” అనే నిజాన్ని చాటిచెబుతూ నెటిజన్ల హృదయాలను బరువెక్కించింది.

ఈ వయసులో చాలామంది రిటైర్మెంట్ గురించి ఆలోచించే సమయంలో.. తన ఆత్మగౌరవాన్ని, ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా శ్రమించడానికి సిద్ధపడటం ఎందరికో ఆదర్శంగా నిలుస్తోంది. ఆధునిక సాంకేతికత, కంప్యూటరీకరణ రాజ్యమేలుతున్న ప్రస్తుత కాలంలోనూ.. అత్యంత నిరాడంబరంగా ఓ తెల్ల కాగితంపై తన నైపుణ్యాలను చేతిరాతతో రాసుకుని చూపించిన తీరు.. నిజమైన శ్రమకు ఎలాంటి ఆడంబరాలు అవసరం లేదని నిరూపిస్తోంది.

నెట్టింట చక్కర్లు కొడుతున్న ఈ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. “వయసనేది కేవలం ఒక సంఖ్య మాత్రమే.. ప్రయత్నించడానికి వయసు అడ్డంకి కాదు” అంటూ ఆమెపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. అంతేకాకుండా, ఈ వయసులోనూ చెదరని సంకల్పంతో శ్రమిస్తున్న ఆ మహిళకు త్వరలోనే మంచి ఉద్యోగావకాశం దక్కాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.


Posted

in

by

Tags: