పశ్చిమ బెంగాల్లోని జల్పాయ్గురి ప్రాంతంలో… తీస్తా నదిలో భారీ వరద ప్రవాహానికి కొట్టుకుపోయిన ఓ ఏనుగు పిల్లను ఐదుగురు స్థానిక మత్స్యకారులు ప్రాణాలకు తెగించి కాపాడారు.
అపల్కాంత్ అటవీ ప్రాంతంలోని కదంబరి అటవీ సరిహద్దు సమీపంలో ఏనుగుల గుంపు తీస్తా నదిని దాటేందుకు ప్రయత్నిస్తుండగా… ఒక్కసారిగా వరద ఉద్ధృతి పెరిగింది.
దీంతో ఓ ఏనుగు పిల్ల తల్లి నుంచి విడిపోయి… దాదాపు 4 కిలోమీటర్ల దూరం నదిలో కొట్టుకుపోయింది.
నది మధ్యలోకి వెళ్లిన ఆ చిన్న ఏనుగు… ఉద్ధృతమైన ప్రవాహాన్ని తట్టుకుని ఈదలేకపోయింది. చివరకు తన చిన్న తొండాన్ని మాత్రమే నీటి పైకి ఉంచి… ఊపిరి కోసం అల్లాడుతోంది.
అదే సమయంలో మత్స్యకారులు బాబు దాస్, మిథున్ దాస్, ఖాదర్ దాస్, విశ్వనాథ్, గోపాల్ ఆ ఏనుగు పిల్లను గమనించారు.
ప్రవాహం ఎంత ప్రమాదకరంగా ఉన్నా… ఏమాత్రం వెనుకాడకుండా తమ చిన్న పడవతో ఏనుగు పిల్ల దగ్గరకు వెళ్లారు.
ఆ తర్వాత కొందరు మత్స్యకారులు నదిలోకి దూకి… ఏనుగు పిల్లను సురక్షితంగా పడవలోకి ఎక్కించారు.
పడవను ఒడ్డుకు తీసుకువస్తున్న సమయంలో కూడా… ముగ్గురు మత్స్యకారులు నీటిలోనే ఈదుతూ, ఉద్ధృతమైన ప్రవాహాన్ని ఎదురించి పడవను ఒడ్డువైపు నెట్టారు.
చివరకు ఏనుగు పిల్లను సురక్షితంగా ఒడ్డుకు తీసుకొచ్చారు.
అక్కడి నుంచి వెంటనే అటవీశాఖ అధికారులకు అప్పగించారు. కదంబరి అటవీ కార్యాలయంలో ఏనుగు పిల్లకు అత్యవసర వైద్యం అందించారు.
అటవీశాఖ అధికారులు కూడా వెంటనే రంగంలోకి దిగారు. తల్లి ఏనుగు, దాని గుంపు ఎక్కడ ఉందో గుర్తించి… ఏనుగు పిల్లను తీస్తా నదిలోని సురక్షిత ప్రాంతానికి తరలించారు.
అటవీశాఖ అధికారులు, స్థానికులు, మత్స్యకారులు కలిసి దాదాపు రెండు గంటల పాటు చేసిన ప్రయత్నం చివరకు ఫలించింది.
తల్లి ఏనుగు తన పిల్లను గుర్తించి… దాని దగ్గరకు చేరింది.
అంతేకాదు… తల్లి ఒడిలోకి చేరిన ఏనుగు పిల్ల తల్లి పాలు తాగుతున్న దృశ్యం అక్కడున్నవారిని కదిలించింది.
మనుషుల వాసన ఎక్కువసేపు ఉంటే కొన్ని సందర్భాల్లో ఏనుగులు తమ పిల్లలను తిరిగి స్వీకరించకపోవచ్చనే ఆందోళన ఉండటంతో… మత్స్యకారులు వెంటనే స్పందించి ఏనుగు పిల్లను సురక్షితంగా అటవీశాఖకు అప్పగించడాన్ని అధికారులు అభినందించారు.
ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఓ చిన్న ఏనుగు ప్రాణాలను కాపాడిన ఈ మత్స్యకారుల సాహసం… ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోతో అందరి ప్రశంసలు అందుకుంటోంది.

Leave a Reply