క్రికెట్ మైదానంలో పరుగుల వర్షం కురిపించే యువ ఆటగాళ్లు.. మైదానం బయట తమ అభిమానుల మనసులు గెలుచుకున్నారు. వర్షం కారణంగా మ్యాచ్ మధ్యలోనే ఆగిపోవడంతో నిరాశగా బయటకు వచ్చిన భారత యువ క్రికెటర్లు యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురెల్.. తమ కోసం ఎంతోసేపు ఎదురుచూస్తున్న ఓ అభిమానికి ఊహించని బహుమతి ఇచ్చారు. ఈ భావోద్వేగ దృశ్యానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
న్యూజిలాండ్‌లోని లింకన్ నగరంలో ఉన్న బెర్ట్ సట్‌క్లిఫ్ ఓవల్ మైదానంలో భారత్-ఏ, న్యూజిలాండ్-ఏ జట్ల మధ్య మూడో అనధికారిక టెస్టు మ్యాచ్ జరిగింది. అయితే ఎడతెరిపి లేని వర్షం, మైదానం తడిగా ఉండటంతో మూడో రోజే మ్యాచ్‌ను కొనసాగించడం సాధ్యం కాలేదు. దీంతో ఆటను మధ్యలోనే నిలిపివేశారు.
ఈ మ్యాచ్‌లో భారత యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్ అద్భుతంగా ఆడాడు. కేవలం 138 బంతుల్లో 102 పరుగులు చేసి ఈ సిరీస్‌లో రెండో సెంచరీ సాధించాడు. మరోవైపు ధ్రువ్ జురెల్ కూడా తన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 71 పరుగులు చేశాడు.
మ్యాచ్ వర్షం కారణంగా ఆగిపోయిన తర్వాత మైదానం నుంచి బయటకు వస్తున్న జైస్వాల్, జురెల్‌ను ఓ అభిమాని ఎంతో ఆశగా ఎదురుచూస్తూ కనిపించాడు. అతడి కోరికను గమనించిన ఇద్దరు ఆటగాళ్లు తమ జెర్సీలపై సంతకాలు చేసి అతడికి బహుమతిగా ఇచ్చారు. అంతేకాదు, అభిమానితో ఆప్యాయంగా మాట్లాడి అతడి ఆనందాన్ని రెట్టింపు చేశారు.
తమ అభిమాన క్రికెటర్లను ప్రత్యక్షంగా కలవడమే కాకుండా, వారి సంతకాలతో కూడిన జెర్సీలను అందుకోవడంతో ఆ అభిమాని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ చిన్న సంఘటనలో ఆటగాళ్లు చూపిన అభిమానం, ఆప్యాయత నెటిజన్ల ప్రశంసలు అందుకుంటోంది.

Leave a Reply