గాలి కాలుష్యం తీవ్రమవడంతో, పలు చోట్ల గాలి నాణ్యతా సూచీ (AQI) 400 దాటడం ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది.
ఈ స్థాయి గాలి కాలుష్యం అత్యంత తీవ్రమైన నష్టాన్ని కలిగించే పరిస్థితిగా పరిగణించబడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో గాలిలోని కాలుష్య కణాలు శ్వాస ద్వారా శరీరంలోకి వెళ్లి గుండె, ఊపిరితిత్తులను దెబ్బతీస్తాయి. అందువల్ల, కాలుష్యం ఎక్కువగా ఉండే రోజుల్లో ఉదయం పూట వాకింగ్, జాగింగ్, సైక్లింగ్ వంటి బహిరంగ కార్యకలాపాలను నివారించాలని వైద్యులు సూచిస్తున్నారు.
గురుగ్రామ్‌లోని ఆర్టెమిస్ ఆసుపత్రికి చెందిన శ్వాసకోశ వ్యాధులు, ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ICU) హెడ్ డాక్టర్ ప్రశాంత్ సక్సేనా మాట్లాడుతూ.. కలుషితమైన గాలిలో నడవడం వల్ల దగ్గు, గొంతులో మంట, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది (ఆయాసం), శ్వాస తీసుకునేటప్పుడు శబ్దం రావడం వంటి సమస్యలు వస్తాయని చెప్పారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణీలు, ఇప్పటికే గుండె లేదా శ్వాస సంబంధిత వ్యాధులు ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేనివారు కూడా గాలి కాలుష్యం అత్యంత ప్రమాదకర స్థాయిలో ఉన్నప్పుడు ఆరుబయట వ్యాయామాలు చేయకపోవడమే మంచిది.
గాలిలో ఉండే పీఎం 2.5 (PM 2.5) లాంటి అత్యంత సూక్ష్మమైన కాలుష్య కణాలు ఊపిరితిత్తుల లోపలి భాగాలకు వెళ్లి వాపును కలిగిస్తాయి. అంతేకాకుండా, ఇవి రక్తనాళాలను కూడా ప్రభావితం చేస్తాయి. రక్తనాళాలు కుంచించుకుపోవడం వల్ల రక్తపోటు (బీపీ) పెరగడంతో పాటు గుండెపోటు వచ్చే ప్రమాదం కూడా ఉందని డాక్టర్ ప్రశాంత్ సక్సేనా హెచ్చరిస్తున్నారు. ఇవే కాకుండా, కలుషితమైన గాలిని పీల్చడం వల్ల కళ్లలో దురద, మంట వంటి సమస్యలు కూడా రావచ్చు.
గాలి కాలుష్యం ఎక్కువగా ఉన్న రోజుల్లో వ్యాయామాన్ని పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు; దానికి బదులుగా ఇంటి లోపలే వాకింగ్ చేయవచ్చు. యోగా, స్ట్రెచింగ్ వ్యాయామాలు, తేలికపాటి వ్యాయామాలు చేయవచ్చు. ఒకవేళ తప్పనిసరిగా బయటకు వెళ్లాల్సి వస్తే, ఆ సమయానికి ఉన్న గాలి నాణ్యతను తనిఖీ చేసుకుని, కచ్చితంగా N95 మాస్క్ ధరించి వెళ్లాలి. ముఖ్యంగా, గాలి కాలుష్యం అత్యంత దారుణంగా ఉన్న పరిస్థితుల్లో ఆరుబయట వాకింగ్‌ను నివారించడమే సురక్షితం.

Leave a Reply