పెళ్లి అనేది ఒక నమ్మకం, కలిసి నడుస్తామనే వాగ్దానం. కానీ ఆ బంధం మొబైల్ స్క్రీన్పై రాసే మూడు పదాలతో ముక్కలైపోతే ఆ మహిళ పరిస్థితి వర్ణనాతీతం. బీహార్లోని బెగుసరాయ్కు చెందిన రుఖ్సానా ఖాటూన్ జీవితం కూడా ఇలాగే ఛిన్నాభిన్నమైంది. భర్త వాట్సాప్ మెసేజ్ ద్వారా తీన్ తలాక్ చెప్పడంతో, ఆమె న్యాయం కోసం పోలీస్ స్టేషన్లు, కార్యాలయాల చుట్టూ తిరుగుతోంది.
సంఘటన వివరాలు: ఈ ఉదంతం బెగుసరాయ్ జిల్లాలోని ఫుల్వరియా పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది. బాధితురాలు రుఖ్సానా ఆరోపణల ప్రకారం.. ఆమె భర్త మొహమ్మద్ మక్బూల్ ఫిబ్రవరి 20, 2024న వాట్సాప్ సందేశం ద్వారా ఆమెకు ‘తీన్ తలాక్’ ఇచ్చాడు. 2022లో వీరి వివాహం జరిగింది. పెళ్లి సమయంలో రూ. 51 వేల మెహర్, రెండు తులాల బంగారం ఇచ్చారు. అయితే పెళ్లైన కొన్ని నెలలకే అదనపు కట్నం కోసం వేధింపులు మొదలయ్యాయి.
రూ. 17 లక్షల వరకు వసూలు: ఐదు లక్షల రూపాయలు కట్నం ఇవ్వలేదనే కారణంతో తనను కొట్టి, ఇంట్లో నుండి గెంటివేశారని రుఖ్సానా వాపోయింది. సమాజం జోక్యంతో భర్త తిరిగి తనను ఢిల్లీకి తీసుకెళ్లినప్పటికీ, అక్కడ కూడా వేధింపులు ఆగలేదు. వ్యాపారం పేరుతో తన తల్లి దగ్గర ఉన్న నగలు కుదువ పెట్టించి, ఫిక్స్డ్ డిపాజిట్లు రద్దు చేయించి సుమారు రూ. 16 నుండి 17 లక్షల వరకు వసూలు చేశాడని ఆమె ఆరోపించింది.
హలాలా చేయాలంటూ నిబంధన: డబ్బు తిరిగి అడిగితే తన కుటుంబంపై దాడులు చేయించారని బాధితురాలు తెలిపింది. 2023లో కుమారుడు పుట్టిన తర్వాత వేధింపులు మరీ ఎక్కువయ్యాయి. భర్త తనను వ్యభిచారంలోకి నెట్టేస్తానని బెదిరించడమే కాకుండా, తనతో కలిసి ఉండాలంటే మామ లేదా బావ తో ‘హలాలా’ చేయాలనే నిబంధన పెట్టాడని ఆమె చేసిన ఆరోపణ ఇప్పుడు చర్చనీయాంశమైంది.
పోలీసుల తీరుపై విమర్శలు: తీన్ తలాక్ నిషేధ చట్టం ఉన్నప్పటికీ, పోలీసులు తన కేసును సరిగ్గా పట్టించుకోవడం లేదని రుఖ్సానా ఆవేదన వ్యక్తం చేస్తోంది. తనపైనే దొంగతనం కేసు పెట్టారని ఆమె అంటోంది. జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు మమతా కుమారి ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్నారు. దీనిపై పోలీసుల నుండి నివేదిక కోరారు. సమాజంలో అవగాహన వస్తేనే ఇలాంటి దురాచారాలు అంతమవుతాయని ఆమె పేర్కొన్నారు.
