తమిళనాడు తెన్‌కాశీలో ఒక యువకుడు కేవలం తన వాట్సాప్‌కు వచ్చిన మెసేజ్‌ని ఓపెన్ చేసినందుకే అతని ఖాతా నుండి 2 లక్షల రూపాయలు మాయమయ్యాయి. కనీసం ఓటీపీ (OTP) కూడా చెప్పకుండానే ఇంత పెద్ద మొత్తంలో డబ్బు ఎలా చోరీకి గురైంది? సైబర్ నేరగాళ్లు చిక్కుతారా?
అసలేం జరిగింది? తెన్‌కాశీ జిల్లా కడయనల్లూర్ మదీనా నగర్‌కు చెందిన అన్వర్ ఖాజా (26) కృష్ణాపురం ప్రాంతంలో బైక్ వాటర్ సర్వీస్ సెంటర్ నడుపుతున్నాడు. గత నెల 31వ తేదీన అతని మొబైల్‌కు వందల సంఖ్యలో ఎస్ఎమ్ఎస్లు (SMS) వచ్చాయి. ఆ వెంటనే ప్రముఖ యాప్ ‘కుకూ ఎఫ్ఎం’ (KUKU FM) పేరుతో ఒక వాట్సాప్ మెసేజ్ వచ్చింది.
అది సాధారణ మెసేజ్ అని భావించిన అన్వర్ ఖాజా, దానిని ఓపెన్ చేసి అందులోని ఓటీపీని కేవలం చూశాడు తప్ప.. దానిని ఎవరికీ చెప్పలేదు లేదా ఎక్కడా ఎంటర్ చేయలేదు. కానీ, ఆ రాత్రి 10 గంటల సమయంలో అతని ఫోన్ హ్యాక్ అయ్యిందని, బ్యాంకు ఖాతా నుండి రూ. 2.21 లక్షలు విడతల వారీగా డ్రా అయినట్లు తెలిసింది.
అన్వర్ ఖాజా వెంటనే ఆన్లైన్లో మరియు తెన్‌కాశీ జిల్లా ఎస్పీ కార్యాలయంలోని సైబర్ క్రైమ్ విభాగంలో ఫిర్యాదు చేశాడు.
నేరగాళ్ల వ్యూహం: మొత్తం 5 దఫాలుగా అన్వర్ ఖాతా నుండి డబ్బు ముగ్గురు వ్యక్తుల బ్యాంక్ అకౌంట్లకు బదిలీ అయ్యింది. నెలల తరబడి తాను కష్టపడి దాచుకున్న సొమ్ము ఒక్కరోజులో మాయమవ్వడంపై అన్వర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. సాధారణంగా ఏదైనా APK ఫైల్‌ను డౌన్లోడ్ చేస్తేనే ఫోన్ హ్యాక్ అవుతుందని అందరూ భావిస్తారు, కానీ కేవలం వాట్సాప్ చాట్ ఓపెన్ చేసినందుకే డబ్బు పోవడం స్థానిక వ్యాపారులను ఆందోళనకు గురిచేస్తోంది.
