ప్రముఖ క్విక్ కామర్స్ సంస్థ ‘జెప్టో’ (Zepto) కాలేజ్ క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌కు సంబంధించి విడుదల చేసినట్లుగా చెబుతున్న ఒక పోస్టర్ సోషల్ మీడియాలో తీవ్ర దుమారాన్ని రేపుతోంది.
‘X’ (ట్విట్టర్) వేదికగా ఒక యూజర్ పంచుకున్న ఆ ప్రకటన ప్రకారం.. కంప్యూటర్ సైన్స్, బీబీఏ (BBA), బీసీఏ (BCA), మరియు బీకాం (B.Com) చదువుతున్న విద్యార్థులకు ‘ఇంటర్న్ – మదర్‌హబ్ ఆపరేషన్స్’ పేరుతో 3 నెలల ఇంటర్న్‌షిప్‌ను నెలకు రూ. 20,000 స్టైఫండ్‌తో ఆఫర్ చేస్తున్నట్లు పేర్కొన్నారు.
వివాదానికి కారణమైన నిబంధనలు:
ఈ ఉద్యోగానికి నిర్దేశించిన అర్హతలే తీవ్ర వివాదానికి దారితీశాయి:
“పురుష అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి” అని స్పష్టం చేశారు.
“20 కిలోల వరకు బరువులు ఎత్తగలగాలి.. రోజుకు 10 నుండి 12 గంటల పాటు నిలబడే పనిచేసే శారీరక సామర్థ్యం ఉండాలి” అని పేర్కొన్నారు.
కంప్యూటర్ సైన్స్, కామర్స్ డిగ్రీలు చదువుతున్న విద్యార్థుల నుంచి సాంకేతిక పరిజ్ఞానం, విశ్లేషణాత్మక నైపుణ్యాలను ఆశించాల్సింది పోయి.. ఇలా శారీరక శ్రమను కోరడం, లింగ వివక్ష చూపడంపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నెటిజన్ల వ్యంగ్యాస్త్రాలు:
ఈ పోస్టర్‌పై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు:
“ఇకపై ఇంటర్న్‌షిప్ సంపాదించాలంటే కోడింగ్ కాకుండా జిమ్‌కు వెళ్లి బాడీ పెంచాలేమో!”
“నాలుగేళ్లు కష్టపడి డిగ్రీ చదివింది రోజుకు 12 గంటలు నిలబడి 20 కిలోల బరువులు మోయడానికా?”
అయితే, నెట్టింట చక్కర్లు కొడుతున్న ఈ పోస్టర్ నిజమైనదా లేక ఎవరైనా ఉద్దేశపూర్వకంగా సృష్టించిన నకిలీ పోస్టరా అనే విషయంపై ‘జెప్టో’ సంస్థ ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన లేదా వివరణ ఇవ్వలేదు.
