ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికత అద్భుత పురోగతితో భవిష్యత్తులో మనుషుల పని గంటలు సగానికి తగ్గుతాయని అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ జోస్యం చెప్పారు.
ఫాక్స్ న్యూస్ (Fox News) ఛానెల్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ఏఐ సాంకేతికత అందించే ఉత్పాదకత (ప్రొడక్టివిటీ) కారణంగా వారంలో కేవలం 3 రోజులు మాత్రమే పనిచేసి, ఒక్కరి వేతనంతోనే కుటుంబం మొత్తం విలాసవంతమైన జీవితాన్ని గడపడం సాధ్యమవుతుందని పేర్కొన్నారు.
ఏఐ రాకతో లక్షలాది ఉద్యోగాలు ఊడిపోతాయన్న విస్తృత భయాలను బెజోస్ తోసిపుచ్చారు. “అసలు నిజమేమిటంటే.. ఏఐ పని సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుతుంది కాబట్టి, భవిష్యత్తులో కంపెనీలకు పని చేయడానికి మనుషులే దొరకని కొరత ఏర్పడుతుంది. కుటుంబ అవసరాల కోసం రెండు ఉద్యోగాలు చేయాల్సిన పరిస్థితి మారి, ఒకే ఉద్యోగం ద్వారా ప్రజలు తమ అన్ని అవసరాలను సులభంగా తీర్చుకోగలుగుతారు” అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇక అమెజాన్‌లో ఇటీవల జరిగిన 30,000 మంది ఉద్యోగుల తొలగింపుపై స్పందిస్తూ.. కరోనా సమయంలో అవసరానికి మించి సిబ్బందిని చేర్చుకోవడం వల్ల చేసిన సర్దుబాటు చర్యే ఇదని వివరించారు.
అలాగే తన సరికొత్త ఏఐ స్టార్టప్ ‘ప్రొమిథియస్’ (Prometheus) ద్వారా ‘ఆర్టిఫిషియల్ జనరల్ ఇంజనీర్’ అనే అత్యాధునిక టూల్స్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపిన ఆయన.. వీటి ద్వారా సామాన్యులు సైతం తమ వినూత్న ఆలోచనలను సరికొత్త ఆవిష్కరణలుగా మార్చవచ్చని అన్నారు. ఏఐ రంగంలోకి వెల్లువెత్తుతున్న భారీ పెట్టుబడులపై మాట్లాడుతూ.. ఇది ‘పెట్టుబడి బుడగ’ (ఇన్వెస్ట్మెంట్ బబుల్) అవునా కాదా అనేది కచ్చితంగా చెప్పలేకపోయినప్పటికీ, ఉపయోగకరమైన టెక్నాలజీ ఎల్లప్పుడూ నిలిచి ఉంటుందని స్పష్టం చేశారు.
మరోవైపు స్పేస్ రేస్ గురించి ప్రస్తావిస్తూ.. చంద్రుడిపైకి మళ్లీ మానవులను పంపే పోటీలో అమెరికా కచ్చితంగా చైనాను ఓడించాలని, 2028 నాటికి అమెరికా వ్యోమగాములు చంద్రుడిపై అడుగుపెట్టడం సాధ్యమేనని ధీమా వ్యక్తం చేశారు. జెఫ్ బెజోస్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా టెక్ వర్గాల్లో, కార్పొరేట్ రంగంలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి!

Leave a Reply