మన వేద పురాణాల ప్రకారం కామదేవుడు మన్మథుడు. శివుని తపస్సును భంగం చేయబోయి, ఆయన మూడో కంటి మంటలకు భస్మమై ‘అశరీరి’గా మిగిలిపోయిన వాడు. అందుకే మన్మథుడు అంటే కేవలం ఒక రూపం కాదు, అది ఒక స్థితి. మనసును మధించేదే ‘మన్మథ’. ఈ మనో చంచల్యం యవ్వనంలోనే కదా పుట్టేది? అందుకే కవులు ఆయనకు చెరుకు గడను విల్లుగా, పూలనే బాణాలుగా ఇచ్చారు. తీపి, సువాసనలు కలిస్తే ఏ మనసైనా కరగక తప్పుతుందా? అందుకే మన్మథుడు మనసులను దోచుకుంటాడనేది ఒక అద్భుతమైన కల్పన.
కామదేవుడి ఐదు బాణాలు – శరీర శాస్త్రం!
భారతీయ కవులు కామానికి సైతం దైవత్వాన్ని ఆపాదించారు. మన్మథుడి వద్ద ఐదు రకాల పూల బాణాలు (అరవిందం, అశోకం, నీలోత్పలం, చూతం, నవమల్లిక) ఉంటాయట. ఇవన్నీ సంభోగ శృంగారంలోని వివిధ దశలను సూచిస్తాయి.
- అరవిందం (ముఖం): మొదట కన్ను ముఖాన్ని చూస్తుంది.
- అశోకం: ఆ చూపు మనసును ప్రఫుల్లం చేస్తుంది.
- నీలోత్పలం: మనసులో కోరికల చిగుళ్లు మొదలవుతాయి.
- చూతం (మామిడి పండు): శరీరం రసభరితంగా మారుతుంది.
- నవమల్లిక: మల్లెపూవులా మేని సుగంధం వెదజల్లుతుంది. ఇది కేవలం కవిత్వం కాదు, శృంగారానికి ముందు శరీరంలో జరిగే వైజ్ఞానిక మార్పులకు ఒక ప్రతీక.
భర్తృహరిని మార్చిన ఆ ‘మాయా ఫలం’!
శృంగార సాహిత్యానికి భర్తృహరి పేరు లేకుండా పరిపూర్ణత రాదు. సంస్కృతంలో ఆయన ఒక గొప్ప రసిక చక్రవర్తి. కానీ, ఆయన అంతటి భోగి.. యోగిగా ఎలా మారాడు? దాని వెనుక ఒక రోచకమైన కథ ఉంది.
భర్తృహరి ఒక రాజు. ఒకసారి ఆయన ఆస్థానానికి ఒక సాధువు వచ్చి ఒక దివ్యమైన పండును ఇచ్చి, “దీనిని తింటే వందేళ్లు ఆరోగ్యంగా జీవిస్తారు” అని చెప్పాడు. భర్తృహరి తాను ఒక్కడే జీవించడం కంటే, తన ప్రాణప్రదమైన భార్య (రాణి) తనతో ఉండాలని భావించి ఆ పండును ఆమెకు ఇచ్చాడు. కానీ, ఆ రాణి తన భర్త కంటే, రహస్యంగా ప్రేమిస్తున్న అశ్వశాల మావటివాడికి ఆ పండును ఇచ్చింది!
అక్కడితో ఆగలేదు.. ఆ మావటివాడు తాను ప్రేమించే లాయం ఊడ్చే పనిమనిషికి ఆ పండును ఇచ్చాడు. విచిత్రం ఏమిటంటే, ఆ పనిమనిషికి రాజు భర్తృహరితో అక్రమ సంబంధం ఉంది! ఆమె ఆ పండును తీసుకువచ్చి రాజుకే బహుమతిగా ఇచ్చింది. పండు చేతులు మారి మళ్లీ తన వద్దకే రావడంతో భర్తృహరి దిగ్భ్రాంతికి లోనయ్యాడు. ‘నిజమైన ప్రేమ’ ఎక్కడ ఉందో వెతికిన అతనికి లోకమంతా ‘కామ’ మయంగా కనిపించింది.
ఒక్క శ్లోకంతో వైరాగ్యం!
ఈ దారుణమైన పరిస్థితిని చూసి భర్తృహరి ఒక ప్రసిద్ధ శ్లోకాన్ని రాశారు:
“యాం చింతయామి సతతం మయి సా విరక్తా.. సాప్యన్యమిచ్ఛతి జనోప్యయమన్యసక్తః..”
దీని అర్థం: “నేను ఎవరిని సదా ధ్యానిస్తున్నానో ఆమెకు నాపై ఇష్టం లేదు. ఆమె మరొకరిని కోరుతోంది. ఆ వ్యక్తి ఇంకొకరి మోహంలో ఉన్నాడు. కానీ ఆ ఇంకొకరు నాకోసం తహతహలాడుతోంది! ఛీ.. ఆమెకు, అతనికి, ఆ మన్మథుడికి మరియు నాకూ కూడా ధిక్కారం!”
ఈ సంఘటనతో విరక్తి చెందిన భర్తృహరి.. అపారమైన సామ్రాజ్యాన్ని, సుందరమైన భార్యలను వదిలి కాషాయం కట్టుకుని సన్యాసిగా మారిపోయాడు. ఆ వైరాగ్యం నుండే సంస్కృత సాహిత్యానికి ఆభరణాలైన నీతి శతకం, శృంగార శతకం, వైరాగ్య శతకం పుట్టుకొచ్చాయి.
కవి వర్ణించినట్లు.. మనసు అణువంతే కావచ్చు, కానీ దానిలో పుట్టే ఆశ అనే తీగ 14 లోకాలను చుట్టేయగలదు. దానిని నిగ్రహించడం ఎవరి తరమూ కాదని భర్తృహరి జీవితం మనకు గుణపాఠం చెబుతోంది.
