“వాసిలైన్ ఇకపై బేసిలైన్ అయిపోయిందా?”: కంపెనీ పేరునే మార్చేసిన కొరియన్ యువతి.. రాత్రికి రాత్రే CEO అయిన కొరియన్ ఇన్‌ఫ్లుయెన్సర్.!!

సోషల్ మీడియాలో ఎప్పుడు ఏ విషయం ట్రెండ్ అవుతుందో ఎవరూ ఊహించలేరు. ఆ కోవలోనే, ప్రముఖ స్కిన్‌కేర్ బ్రాండ్ ‘వాసిలైన్’ (Vaseline)కు సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతోంది.

దక్షిణ కొరియాకు చెందిన ప్రఖ్యాత ఇన్‌ఫ్లుయెన్సర్ ‘మిన్ డే లీ’ వాసిలైన్ ఉత్పత్తులపై ఒక వీడియోను షేర్ చేశారు. కొరియన్ భాషలో ‘V’ అక్షరాన్ని పలకడం కాస్త కష్టం కావడంతో.. ఆమె ‘వాసిలైన్’ను ‘బేసిలైన్’ (Baseline/Bhaseline) అని ఎంతో ముద్దుగా ఉచ్ఛరించారు. ఈ వీడియో కొద్ది రోజుల్లోనే 36 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సాధించి ఇంటర్నెట్‌లో భారీ ట్రెండ్‌గా మారింది.

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లంతా వాసిలైన్ ఉత్పత్తులను ‘బేసిలైన్’ అని పిలవడం మొదలుపెట్టారు. ఈ ట్రెండ్ కాస్తా వాసిలైన్ కంపెనీ దృష్టికి కూడా వెళ్లింది. సాధారణంగా బ్రాండ్ పేరును తప్పుగా పలికితే సరిదిద్దడం లేదా వివరణ ఇవ్వడం కంపెనీలు చేస్తుంటాయి. కానీ వాసిలైన్ సంస్థ ఎంతో సరదాగా, స్పోర్టివ్‌గా ఈ ట్రెండ్‌లో భాగమైంది. వైరల్ వీడియోను చూసిన తర్వాత తాము తీవ్రంగా ఆలోచించి, తమ బ్రాండ్ పేరును ‘బేసిలైన్’గా అధికారికంగా మార్చుకుంటున్నట్లు ఒక ఫన్నీ ప్రకటన విడుదల చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది.

వాసిలైన్ సంస్థ ప్రదర్శించిన ఈ వినూత్న శైలి నెటిజన్ల నుంచి విశేష ఆదరణ దక్కించుకుంది. నెటిజన్లు ఆ బ్రాండ్ మార్కెటింగ్ టీమ్‌ను మెచ్చుకుంటూ.. “Love this WS”, “2026లో ఇలాంటిది ఊహించలేదు” అంటూ కామెంట్లు పెడుతున్నారు. అంతటితో ఆగకుండా వాసిలైన్ కంపెనీ మరో అడుగు ముందుకేసి.. ఎలాంటి ఇంటర్వ్యూ లేకుండానే ఈ ట్రెండ్‌ను సృష్టించిన కొరియన్ ఇన్‌ఫ్లుయెన్సర్ మిన్ డే లీని ‘బేసిలైన్’ తాత్కాలిక CEOగా సరదాగా ప్రకటించి నెటిజన్ల మనసులను గెలుచుకుంది. కస్టమర్ల అభిరుచికి, హాస్యానికి గౌరవమిస్తూ ఒక బడా సంస్థ ఎలా స్పందించాలో చెప్పడానికి ఇది చక్కటి ఉదాహరణగా నిలిచింది.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *