తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు 2026 రాష్ట్ర రాజకీయ సమీకరణాలను పూర్తిగా మార్చేశాయి. నటుడి నుండి రాజకీయ నాయకుడిగా మారిన దళపతి విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం (TVK), తొలిసారి ఎన్నికల బరిలోకి దిగి అద్భుత ప్రదర్శన కనబరిచింది. 234 స్థానాలున్న అసెంబ్లీలో 108 సీట్లు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది.
అయితే, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన 118 సీట్ల కంటే 10 సీట్లు తక్కువగా ఉండటంతో విజయ్‌కు రాజకీయ సవాళ్లు ఎదురవుతున్నాయి. బుధవారం విజయ్ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్‌ను కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని క్లెయిమ్ చేశారు. అయితే విజయ్ వద్ద మెజారిటీ నిరూపించుకోవడానికి తగినంత సంఖ్యాబలం లేదని గవర్నర్ హౌస్ వర్గాలు స్పష్టం చేశాయి. దీనివల్ల ప్రస్తుతం సందిగ్ధత కొనసాగుతోంది.
టీవీకే మద్దతు ప్రయత్నాలు వేగవంతం
ప్రభుత్వ ఏర్పాటు కోసం ఇతర పార్టీల మద్దతును టీవీకే కోరుతోంది. విజయ్ పార్టీ అధికారికంగా వీసీకే (VCK) మద్దతు కోరినప్పటికీ, ఆ పార్టీ ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. మరోవైపు, వామపక్షాలు మరియు ఐయూఎంఎల్ (IUML) విజయ్‌కు మద్దతు ఇవ్వడానికి నిరాకరించాయి. కాంగ్రెస్ మాత్రం ఒక షరతుతో కూడిన మద్దతును ప్రకటించింది. విజయ్ పార్టీ బీజేపీ లేదా మరే ఇతర మతతత్వ శక్తులతో సంబంధం పెట్టుకోకూడదనేది కాంగ్రెస్ పెట్టిన షరతు. కాంగ్రెస్ మద్దతుతో టీవీకే బలం 113కు చేరుకుంది. ఇప్పుడు పీఎంకే (PMK), వీసీకే లేదా అన్నాడీఎంకే అసమ్మతి ఎమ్మెల్యేల మద్దతుపైనే విజయ్ అదృష్టం ఆధారపడి ఉంది.
అసెంబ్లీ సమీకరణాలు
2026 ఎన్నికల ఫలితాల ప్రకారం:
- టీవీకే (TVK): 108 సీట్లు
- డీఎంకే (DMK): 59 సీట్లు
- అన్నాడీఎంకే (AIADMK): 47 సీట్లు
- కాంగ్రెస్: 5 సీట్లు
- పీఎంకే (PMK): 4 సీట్లు
- ఇతర పార్టీలు (IUML, CPI, VCK): ఒక్కొక్కటి 2 సీట్లు చొప్పున గెలుచుకున్నాయి.
విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోతే…?
ఒకవేళ విజయ్ మెజారిటీ నిరూపించుకోవడంలో విఫలమైతే, ఇతర ప్రత్యామ్నాయాలు తెరపైకి వచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రాష్ట్రంలో డీఎంకే + అన్నాడీఎంకే కూటమి ఏర్పడే అవకాశం లేకపోలేదు. ఈ రెండు పార్టీల బలం కలిస్తే 106 (59 + 47) సీట్లు అవుతాయి. వీరికి కాంగ్రెస్, వీసీకే మరియు ఇతర చిన్న పార్టీలు తోడైతే మెజారిటీ సులభంగా లభిస్తుంది. సాధారణంగా ఈ రెండు పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది, కానీ ‘ద్రవిడ ఐక్యత’ పేరుతో తాత్కాలిక కూటమి ఏర్పడే అవకాశాలను కొట్టిపారేయలేం. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శత్రువులు ఉండరనేది దీనికి నిదర్శనం.
రాష్ట్రపతి పాలన ప్రత్యామ్నాయం
ఏ పార్టీ లేదా కూటమి అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకోలేకపోతే, గవర్నర్ రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేసే అవకాశం ఉంది. అయితే, ఇది చివరి ప్రత్యామ్నాయంగా మాత్రమే భావిస్తున్నారు. తమిళనాడులో నెలకొన్న ఈ కొత్త రాజకీయ యుద్ధంపై ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. రాబోయే రోజుల్లో ఈ రాజకీయ చదరంగంలో ఎటువంటి నిర్ణయాలు వెలువడతాయో చూడాలి.
