చెన్నై: తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు విజయ్ ఈరోజు సాయంత్రం లోపు 118 మంది ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన మద్దతు లేఖను గవర్నర్‌కు సమర్పిస్తేనే రేపు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంటుంది.
ఎందుకంటే, మద్దతు ఇచ్చే ఎమ్మెల్యేల పూర్తి జాబితా ఇస్తేనే ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానిస్తానని తమిళనాడు ఇంచార్జ్ గవర్నర్ పట్టుబడుతున్నారు. ఈ పరిస్థితుల్లో రేపటి అవకాశాన్ని కోల్పోతే, విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి మే 13 వరకు వేచి చూడాల్సి ఉంటుంది.
మే 7వ తేదీన విజయ్ సీఎంగా బాధ్యతలు చేపట్టే అవకాశం లేదు. ఒకవేళ రేపు సాయంత్రం లోపు గవర్నర్ అడిగిన జాబితా ఇస్తే, మే 8న ప్రమాణ స్వీకారం చేయొచ్చు. కానీ 8 అనేది దురదృష్టకర సంఖ్య (రాశి లేని సంఖ్య) అని భావిస్తే, ఆ రోజు కూడా కార్యక్రమం జరగదు. ఇక మిగిలిన రోజులను పరిశీలిస్తే:
- మే 9 & 10: అష్టమి – ప్రమాణ స్వీకారం జరగదు.
- మే 11: నవమి – ప్రమాణ స్వీకారం జరగదు.
- మే 12: మంగళవారం – శుభకార్యాలకు దూరంగా ఉంటారు.
- మే 13 (బుధవారం): మళ్ళీ మంచి ముహూర్తం ఉన్న రోజు.
అన్నాడీఎంకేలో చీలిక? క్యాంప్ రాజకీయాలు
సి.వి. షణ్ముగం నాయకత్వంలో గణనీయమైన సంఖ్యలో అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు టీవీకేకు మద్దతు ఇవ్వాలని కోరుకుంటున్నట్లు సమాచారం. వీరిని పుదుచ్చేరిలోని తవళైకుప్పం రిసార్ట్‌లో ఉంచినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తమిళ రాజకీయం అత్యంత ఉత్కంఠభరితమైన ఘట్టానికి చేరుకుంది.
కాంగ్రెస్ ఎంట్రీతో మారిన సమీకరణాలు
నిన్నటి వరకు విజయ్‌కు అనుకూలంగా ఉన్న పరిస్థితులు, కాంగ్రెస్ మద్దతు ప్రకటించిన మరుక్షణమే తలకిందులయ్యాయి. కాంగ్రెస్ కేవలం ప్రభుత్వంలో భాగస్వామ్యం మాత్రమే కాకుండా, భవిష్యత్తులో జరిగే స్థానిక సంస్థలు, పార్లమెంటు ఎన్నికల్లో కూడా తమతోనే కూటమి కట్టాలని షరతు పెట్టింది.
కాంగ్రెస్ రావడంతో పీఎంకే (PMK) వెనక్కి తగ్గింది. అన్బుమణి రామదాస్ దీనిపై స్పందించకుండా వెళ్లిపోయారు. దీని వెనుక ఢిల్లీ రాజకీయ బేరాలు ఉన్నాయని, అన్బుమణికి కేంద్ర మంత్రి పదవి ఆశ చూపడం వల్లే ఆయన మద్దతు ఉపసంహరించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే కాంగ్రెస్ చేరికతో అసంతృప్తి చెందిన అన్నాడీఎంకే కూడా వెనక్కి తగ్గింది. వీసీకే (VCK) సైతం డీఎంకే కూటమిని వీడటానికి ధైర్యం చేయలేకపోతోంది.
కోర్టును ఆశ్రయించనున్న టీవీకే
సెంగోట్టయన్, ఆధవ్ అర్జున వంటి వారు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలను టీవీకే వైపు తిప్పుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ప్రస్తుతం గవర్నర్ 117 మంది ఎమ్మెల్యేల మద్దతు లేఖ ఉంటేనే అనుమతిస్తానని మొండికేస్తున్నారు. దీనిని సవాలు చేస్తూ టీవీకే సుప్రీంకోర్టును ఆశ్రయించబోతోంది. సాధారణంగా అతిపెద్ద పార్టీని ప్రభుత్వం ఏర్పాటుకు పిలవాల్సిన బాధ్యత గవర్నర్‌పై ఉంటుంది. కానీ గవర్నర్ నిరాకరిస్తుండటంతో న్యాయపోరాటం అనివార్యమైంది. వచ్చే వారం రోజులు తమిళనాడులో ‘కూవత్తూరు’ తరహా రిసార్ట్ రాజకీయాలు నడవటం ఖాయంగా కనిపిస్తోంది.
