హర్యానాకు చెందిన ఒక విద్యార్థి ఉన్నత విద్య కోసం జార్జియా దేశానికి వెళ్లిన సమయంలో, ఊహించని ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చింది.
తన రోజువారీ ఖర్చులను నెట్టుకురావడం కోసం, మన దేశంలోని స్విగ్గీ, జొమాటో తరహాలో అక్కడ కార్యకలాపాలు సాగిస్తున్న ‘వోల్ట్’ (Wolt) అనే ఫుడ్ డెలివరీ సంస్థలో అతడు డెలివరీ బాయ్‌గా పనిచేయడం ప్రారంభించాడు. అయితే జార్జియా దేశ నిబంధనల ప్రకారం, అక్కడ చదువుకునే విదేశీ విద్యార్థులు ఉద్యోగాలు లేదా పార్ట్‌టైమ్ పనులు చేయడం చట్టవిరుద్ధం. అయినప్పటికీ ఆ నిబంధనలను పట్టించుకోకుండా పని చేసిన ఆ విద్యార్థి, కేవలం 15 రోజుల్లోనే దాదాపు ₹30,000 వరకు సంపాదించాడు.
కానీ, అతని ప్రయత్నం కొద్దిరోజుల్లోనే ముగిసింది. ‘వోల్ట్’ యాప్‌లో అతడు చట్టవిరుద్ధంగా రిజిస్టర్ చేసుకుని పనిచేస్తున్న విషయాన్ని జార్జియా ప్రభుత్వ అధికారులు డేటా ట్రాకింగ్ ద్వారా సులభంగా గుర్తించారు. స్టూడెంట్ వీసా నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను అతనికి తక్షణమే 2,000 జార్జియన్ లారీ (Georgian Lari – భారత కరెన్సీలో దాదాపు ₹70,000) జరిమానా విధించారు. తాను కష్టపడి సంపాదించిన మొత్తం కంటే రెండు రెట్లు ఎక్కువ మొత్తాన్ని జరిమానాగా చెల్లించాల్సి రావడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆ యువకుడు.. “దీనికి బదులు మన దేశంలోనే ఉండి డెలివరీ బాయ్‌గా పనిచేసుకున్నా బాగుండేది” అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.

Leave a Reply