“విద్యార్థుల కోసం రోడ్డెక్కి పోరాడిన కొడుకుకు అండగా నిలిచిన ఆదర్శ తండ్రి!” – వైరల్ అవుతున్న లేఖ వెనుక ఉన్న అసలు కథ..!!!

మహారాష్ట్రలో ఎంపీఎస్సీ (MPSC) ప్రభుత్వ ఉద్యోగ పరీక్షార్థుల సమస్యలపై ఎన్సీపీ (NCP) ఎమ్మెల్యే రోహిత్ పవార్ పుణె వీధుల్లోకి వచ్చి, విద్యార్థులతో కలిసి నడిరోడ్డుపై పడుకుని నిరసన చేపట్టారు.

దీనిని చూసిన రాజకీయ ప్రత్యర్థులు, “రోహిత్ పవార్ నోట్లో బంగారు చెంచాతో పుట్టినవాడు, అతడికి పేద విద్యార్థుల కష్టాలు, పోరాటాలు ఏం తెలుస్తాయి?” అంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు.

ఈ విమర్శలకు ఘాటుగా బదులిస్తూనే, పోరాటబాట పట్టిన తన కొడుకును మరింత ఉత్సాహపరిచేలా ఆయన తండ్రి రాజేంద్ర పవార్ రాసిన ఒక భావోద్వేగ లేఖ ప్రస్తుతం మహారాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర సంచలనాన్ని, చర్చను రేకెత్తిస్తోంది.

ఆ లేఖలో రాజేంద్ర పవార్.. “కుమారా! నీ ప్రత్యర్థులు విమర్శిస్తున్న నీ నోటిలోని ఆ ‘బంగారు చెంచా’ కోసం నేను ఇంకా వెతుకుతూనే ఉన్నాను” అంటూ వ్యంగ్యంగా మాటలు ప్రారంభించారు. అనంతరం తమ కుటుంబ కష్టాల చరిత్రను గుర్తుచేస్తూ.. “మీ తాత అప్పాసాహెబ్ పవార్ 1954లో కేవలం 110 రూపాయల జీతంతో ఉద్యోగంలో చేరి, ఆ తర్వాత 25 ఏళ్ల పాటు రైతుల కోసం, సమాజం కోసం నిరంతరం శ్రమించి ‘పద్మశ్రీ’ పురస్కారాన్ని అందుకున్నారు.

నేను కూడా 1978లో కేవలం 500 డాలర్లతో అమెరికా వెళ్లి చదువుకుని, అక్కడే స్థిరపడిపోకుండా తిరిగి మన మట్టికి వచ్చి రైతుల కోసం పనిచేశాను. మన కుటుంబానికి నిరంతర శ్రమ, పోరాటాలే అసలైన చిరునామా తప్ప, ఉచితంగా వచ్చిన బంగారు చెంచాలు ఏమీ లేవు” అని ప్రత్యర్థుల విమర్శలను తిప్పికొట్టారు.

అంతేకాకుండా, “రాజకీయ క్షేత్రంలో ఏదో ఒక రోజు విషసర్పం నిన్ను కాటేస్తే.. ఆ విషాన్ని జీర్ణించుకునే శక్తిని, దాని విషపు కోరలను పీకేసే ధైర్యాన్ని పెంపొందించుకో” అని కొడుకులో కర్తవ్య బోధ చేశారు.

“నువ్వు నీ కోసం బంగారు చెంచాను వెతుక్కోవద్దు; రోడ్లపైకి వచ్చి పోరాడుతున్న వేలాది మంది నిరుపేద యువకుల భవిష్యత్తును బంగారుమయం చేసేందుకు అహర్నిశలు శ్రమించు” అని చెబుతూ, “నీ ప్రేమగల తండ్రి” అంటూ లేఖను ముగించారు. ప్రస్తుతం ఈ లేఖ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ లక్షలాది మంది నెటిజన్ల మనసులను గెలుచుకుంటోంది.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *