“విపరీతమైన ఒత్తిడి, ఆత్రుత మమ్మల్ని దెబ్బతీశాయి.. గంగూలీ చేసిన ఆ తప్పు.. 2003 ప్రపంచకప్ ఓటమిపై ఎమోషనల్ అయిన హర్భజన్.!!”

2003 వన్డే ప్రపంచకప్ ఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓడిపోవడమే తన క్రికెట్ జీవితంలో అతిపెద్ద విషాదమని మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ మనసులోని మాటను పంచుకున్నాడు.

ఆ మ్యాచ్‌లో తాము తొలిసారి ప్రపంచకప్ ఫైనల్ ఆడుతుండటంతో, ఆ విపరీతమైన ఒత్తిడికి, టెన్షన్‌కు తలొగ్గామని ఆయన పేర్కొన్నాడు. పిచ్‌పై ఉన్న తేమను, బౌలింగ్‌కు అనుకూలించే వాతావరణాన్ని సద్వినియోగం చేసుకోలేకపోవడమే ఆ ఓటమికి ప్రధాన కారణమని ఆయన విచారం వ్యక్తం చేశాడు.

మ్యాచ్ సందర్భంగా తన తొలి 7 ఓవర్లను చాలా అద్భుతంగా వేశానని పేర్కొన్న హర్భజన్ సింగ్, ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు రికీ పాంటింగ్ క్రీజులోకి వచ్చినప్పుడు జరిగిన ఒక ఆసక్తికరమైన సంఘటనను పంచుకున్నాడు.

పాంటింగ్ బ్యాటింగ్‌కు వచ్చినప్పుడు తాను కెప్టెన్ సౌరవ్ గంగూలీ వద్దకు వెళ్లి, “దయచేసి నాకు బౌలింగ్ చేసే అవకాశం ఇవ్వండి” అని రెండు మూడు సార్లు అడిగానని, కానీ గంగూలీ అప్పుడు తనకు బౌలింగ్ చేసేందుకు నిరాకరించాడని ఆయన తెలిపాడు. ఒకవేళ అప్పుడు గంగూలీ తనకు అవకాశం ఇచ్చి ఉంటే, రికీ పాంటింగ్‌ను ఔట్ చేసి ఉండేవాడినని, అలా చేసి ఉంటే మ్యాచ్ ఫలితమే మారిపోయేదని హర్భజన్ సింగ్ అన్నాడు.

ఆ ప్రపంచకప్ టోర్నీ ఆసాంతం భారత్ చాలా అద్భుతంగా ఆడినందున, ఆ ట్రోఫీని మేమే గెలవాల్సి ఉందనేది తన జీవితకాలపు బాధ అని ఆయన ఆవేదనతో పేర్కొన్నాడు.


Posted

in

by

Tags: