Relationship Tips: ప్రేమించిన వ్యక్తి నుండి మోసం ఎదురైనప్పుడు ఎవరైనా మానసికంగా కృంగిపోతారు. డేటింగ్ సమయంలో భాగస్వామి మోసం చేయడం ఒక ఎత్తైతే, వివాహ బంధంలో ఉండి మోసం చేయడం జీవితాన్నే తలకిందులు చేస్తుంది. ఇది గతాన్ని చేదుగా మార్చి, భవిష్యత్తు పునాదులను కదిలిస్తుంది.
సాధారణంగా పురుషులు మోసం చేస్తారని సమాజం భావిస్తుంది, కానీ మహిళలు వివాహేతర సంబంధాల వైపు వెళ్లడం గురించి విన్నప్పుడు అందరూ ఆశ్చర్యపోతుంటారు. ముఖ్యంగా 34 నుండి 38 ఏళ్ల మధ్య వయసున్న మహిళల్లో ఈ ధోరణి ఎక్కువగా కనిపిస్తుందని రిలేషన్షిప్ కోచ్ ‘కోమల్’ విశ్లేషించారు. మహిళలు తమ భర్తలను మోసం చేయడానికి కారణం కేవలం శారీరక వాంఛలు మాత్రమే కాదని, దీని వెనుక లోతైన మానసిక కారణాలు ఉన్నాయని ఆమె పేర్కొన్నారు.
రిలేషన్షిప్ కోచ్ కోమల్ ప్రకారం మహిళలు ఇతర సంబంధాల వైపు వెళ్లడానికి ప్రధాన కారణాలు ఇవే:
1. భావోద్వేగ పరంగా నిర్లక్ష్యం (Emotional Neglect)
34 నుండి 38 ఏళ్ల వయసు వచ్చేసరికి మహిళలు తమ ఉనికిని కోల్పోతున్నట్లు భావిస్తారు. కేవలం ఒక తల్లిగా, భార్యగా లేదా ఇంటి పని మనిషిగా మాత్రమే పరిమితమయ్యామని, తనకంటూ గుర్తింపు లేదని వారు బాధపడతారు. భర్త నుండి కనీస ఆదరణ, గుర్తింపు లభించనప్పుడు వారు మానసిక ఒంటరితనానికి లోనవుతారు. ఇదే ఇతర సంబంధాల వైపు అడుగులు వేయడానికి ప్రధాన కారణం అవుతోంది.
2. బంధంలో శూన్యత (Lack of Intimacy)
భర్తతో సరైన భావోద్వేగ అనుబంధం లేనప్పుడు, శారీరక సాన్నిహిత్యం కూడా వారికి వెలితిగా అనిపిస్తుంది. తమ మనసులోని మాటను పంచుకునే వెసులుబాటు లేకపోవడం, భద్రత లేని భావన వారిని దెబ్బతీస్తాయి. కేవలం శారీరక కలయిక కంటే, భర్తతో మనసు విప్పి మాట్లాడాలని వారు కోరుకుంటారు.
3. వ్యక్తిత్వ సంక్షోభం (Identity Crisis)
30 ఏళ్లు దాటిన తర్వాత మహిళలు తరచుగా “కుటుంబం వెలుపల నా ఉనికి ఏమిటి?”, “నా కలలు ఏమయ్యాయి?”, “నిజమైన ప్రేమ అంటే ఇదేనా?” అనే ప్రశ్నలు వేసుకుంటారు. ఈ ఆత్మపరిశీలనలో వచ్చే అసంతృప్తి వారిని ఒక రకమైన ఊపిరాడని స్థితిలోకి (Suffocation) నెడుతుంది.
4. కొత్త వ్యక్తి ఇచ్చే ప్రత్యేక గుర్తింపు
భర్త తనను నిర్లక్ష్యం చేస్తున్న సమయంలో, ఎవరైనా కొత్త వ్యక్తి పరిచయమై తనను ప్రత్యేకంగా చూసినా, పొగిడినా మహిళలు ఆకర్షితులవుతారు. ఆ కొత్త పరిచయం వారికి స్వేచ్ఛగా గాలి పీల్చుకున్నట్లు, తమను ఎవరో గౌరవిస్తున్నట్లు అనిపిస్తుంది.
5. మనసులోని గాయాలు
చాలా సందర్భాల్లో మనసులోని బాధలు లేదా పాత గాయాలు మానకపోవడం అఫైర్లకు దారితీస్తుంది. ఎవరైనా తమ బాధను అర్థం చేసుకుని ఊరటనిచ్చే ‘మందు’ లాగా అనిపిస్తే, మహిళలు వారి వైపు శారీరక కంటే మానసిక పరంగానే ఎక్కువగా ఆకర్షితులవుతారు.
ముఖ్య గమనిక: రిలేషన్షిప్ కోచ్ తన పోస్ట్‌లో ‘మోసం చేయడం’ (Cheating) సరైనదని ఎక్కడా సమర్థించలేదు. కేవలం మహిళలు ఎందుకు ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటారో వాటి వెనుక ఉన్న మానసిక కారణాలను మాత్రమే వివరించడానికి ప్రయత్నించారు.
