వివాహితుడైన ఒక పురుషుడు, మరొక వయోజన మహిళతో ఆమె సమ్మతితో ‘లివ్-ఇన్’ రిలేషన్‌లో ఉంటే, అతనిపై ఎలాంటి క్రిమినల్ చర్యలు తీసుకోలేమని అలహాబాద్ హైకోర్టు స్పష్టం చేసింది.
నైతికతను, చట్టాన్ని (Law) విడివిడిగా చూడాలని కోర్టు పేర్కొంది. ఒక చర్య చట్టబద్ధంగా నేరమని నిర్వచించబడనంత వరకు, సామాజిక అభిప్రాయాలు లేదా నైతిక విలువలు పౌరుల హక్కులను కాపాడే న్యాయస్థానాల పనితీరును శాసించలేవని కోర్టు తీర్పునిచ్చింది. సమాజం దృష్టిలో ఒక విషయం ‘తప్పు’ లేదా ‘అనైతికం’ అనిపించినా, దేశ చట్ట సభల్లో అది ‘నేరం’ అని వ్రాయబడనంత వరకు ఒక వ్యక్తిని శిక్షించలేమని న్యాయమూర్తులు స్పష్టం చేశారు.
కేసు నేపథ్యం
ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌కు చెందిన 18 ఏళ్ల యువతి, ఇప్పటికే వివాహమైన ఒక వ్యక్తితో పరస్పర అంగీకారంతో ‘లివ్-ఇన్’ పద్ధతిలో కలిసి జీవిస్తున్నారు. దీనిని ఆ యువతి కుటుంబ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు. యువతి కుటుంబం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తూ.. “వివాహితుడైన ఈ వ్యక్తి మా కుమార్తెను ఆశ చూపి మోసం చేసి తీసుకువెళ్లాడు. వివాహమైన వ్యక్తి మరొక మహిళతో కలిసి ఉండటం చట్టరీత్యా నేరం” అని వాదించారు.
మరోవైపు, తమ కుటుంబ సభ్యుల నుండి ప్రాణహాని ఉందని, ‘గౌరవ హత్య’ (Honor Killing) చేసే అవకాశం ఉందని ఆ జంట రక్షణ కోరుతూ హైకోర్టును ఆశ్రయించింది. అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జె.జె.మునీర్ మరియు జస్టిస్ తరుణ్ సక్సేనాలతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది.
తీర్పులోని ముఖ్యాంశాలు:
చట్టం వర్సెస్ నైతికత: వివాహితుడైన పురుషుడు మరో వయోజన మహిళతో ఆమె ఇష్టప్రకారం కలిసి ఉంటే అది నేరం కాదు. సమాజం దీనిని తప్పుగా చూసినా, చట్టం ప్రకారం శిక్షార్హం కాదు. పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛను కాపాడటమే కోర్టుల బాధ్యత.
అరెస్టుపై స్టే: 18 ఏళ్ల యువతితో లివ్-ఇన్ రిలేషన్‌లో ఉన్న వ్యక్తిపై ‘భారతీయ న్యాయ సంహిత’ (BNS) సెక్షన్ 87 కింద నమోదైన కేసులో, తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు అతడిని అరెస్టు చేయకూడదని కోర్టు మధ్యంతర స్టే విధించింది.
పోలీసుల బాధ్యత: “కలిసి జీవిస్తున్న ఇద్దరు వయోజన వ్యక్తులకు రక్షణ కల్పించడం పోలీసుల ప్రాథమిక బాధ్యత” అని కోర్టు పేర్కొంది. షాజహాన్‌పూర్ ఎస్పీ స్వయంగా ఆ జంట భద్రతకు బాధ్యత వహించాలని ఆదేశించింది.
కుటుంబ సభ్యులకు కఠిన ఆదేశాలు: యువతి కుటుంబ సభ్యులు ఆ జంటను సంప్రదించడానికి ప్రయత్నించకూడదని, వారున్న చోటికి వెళ్లకూడదని లేదా ఏ రకమైన బెదిరింపులకు పాల్పడకూడదని కోర్టు నిషేధించింది. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు, రెండు వారాల్లోపు సమాధానం ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
