జయలలిత మరణించిన రోజున అప్పటి ఏఐఏడీఎంకే (AIADMK) మంత్రులు తనను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టమని కోరారని వీకే శశికళ తెలిపారు.
ఏఐఏడీఎంకేలో ఊహించని మార్పులు: 2016 అసెంబ్లీ ఎన్నికల్లో ఏఐఏడీఎంకే భారీ విజయం సాధించి జయలలిత ముఖ్యమంత్రి అయ్యారు. అయితే అనారోగ్యం కారణంగా అదే ఏడాది డిసెంబర్లో ఆమె కన్నుమూశారు. జయలలిత మరణం తర్వాత శశికళ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఓ.పన్నీర్‌సెల్వం ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఈ క్రమంలో శశికళను ముఖ్యమంత్రిని చేసే ప్రయత్నాలు జరుగుతుండగానే, అక్రమాస్తుల కేసులో ఆమె జైలు శిక్ష అనుభవించాల్సి వచ్చింది. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో ఎడప్పాడి పళనిస్వామి ముఖ్యమంత్రి అయ్యారు. శశికళ జైలు నుండి తిరిగి వచ్చేలోపే ఆమెను పార్టీ నుండి బహిష్కరించారు.
శశికళ కొత్త పార్టీ: దాదాపు 9 ఏళ్ల నిరీక్షణ తర్వాత శశికళ కొత్త పార్టీని ప్రారంభించారు. రామనాథపురంలో జరిగిన పార్టీ పరిచయ సభలో ఆమె మాట్లాడుతూ.. “2016లో జయలలితకు ఆరోగ్యం క్షీణించి 72 రోజుల పాటు ఆసుపత్రిలో ఉన్నారు. ఆమెను ఇంటికి తీసుకురావడానికి నేను మంచి ముహూర్తం కూడా చూశాను. కానీ ఊహించని విధంగా గుండెపోటు రావడంతో ఆమె మరణించారు. అయితే బయట శత్రువులు నేను జయలలితను చంపేశానని కథలు అల్లారు. రాజకీయాల కోసం చెప్పే ఇలాంటి మాటలను ఎవరైనా నమ్ముతారా?” అని ప్రశ్నించారు.
జయలలిత మరణించిన రాత్రే మంత్రులు, ఎమ్మెల్యేలు తన దగ్గరకు వచ్చి ముఖ్యమంత్రి కావాలని కోరారని, కానీ తాను జయలలితను సొంత అక్కలా భావించానని, ఆ బాధలో పదవి చేపట్టలేనని చెప్పానని ఆమె వివరించారు. అందుకే ఓ.పన్నీర్‌సెల్వంను ముఖ్యమంత్రిగా ఉండమని అప్పట్లో సూచించానని శశికళ పేర్కొన్నారు.
