డైపర్ వేసుకున్న ఒక బుజ్జి కోతి, ఓ వ్యక్తి బైక్ వెనుక సీట్లో కూర్చుని ప్రయాణిస్తున్న హృదయాలను హత్తుకునే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
రోడ్డుపై బైక్ నడుపుతున్న ఆ వ్యక్తి వీపును హత్తుకుని, ఆ చిన్న కోతి ప్రయాణిస్తున్న దృశ్యం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.
మనీష్ కుమార్ అనే వ్యక్తి తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పంచుకున్న ఈ వీడియోలో, నకుల్ అనే వ్యక్తి బైక్ నడుపుతుండగా, అతని వెనుక సీట్లో ఆ చిన్న కోతి కూర్చుని ఉంది. డైపర్ వేసుకున్న ఆ చిన్నారి జంతువు, నకుల్ నడుమును రెండు చేతులతో గట్టిగా పట్టుకుని, చుట్టూ వింతగా చూస్తూ ప్రయాణిస్తోంది.
తన పెంపుడు జంతువు గురించి నకుల్ మాట్లాడుతూ, ఆ కోతి పేరు ‘బజరంగి’ అని పరిచయం చేశాడు. సుమారు రెండేళ్ల క్రితం వచ్చిన ఓ తుఫానులో దీని తల్లి చనిపోయిందని, అనాథగా మారిన ఈ బుజ్జి కోతిని తానే చేరదీసి పెంచుకుంటున్నానని అతను తెలిపాడు.
ఇంకా నకుల్ మాట్లాడుతూ.. “బజరంగి నాపై ఎంతో ప్రేమ పెంచుకుంది. నేను దాన్ని ఎక్కడా బోనులో బంధించలేదు, స్వేచ్ఛగానే వదిలేశాను. కానీ అది నన్ను వదిలి ఉండలేక ఎప్పుడూ నా వెంటే ఉండాలని కోరుకుంటుంది” అని భావోద్వేగంగా చెప్పాడు.
ఈ హృద్యమైన దృశ్యాన్ని చూసిన నెటిజన్లు, ఈ రోజు తాము చూసిన అత్యుత్తమమైన, అందమైన వీడియో ఇదేనంటూ ప్రశంసిస్తున్నారు. అంతేకాకుండా తల్లిని కోల్పోయిన కోతిని కాపాడి అల్లారుముద్దుగా పెంచుతున్న నకుల్ దయార్ద్ర హృదయాన్ని పలువురు మెచ్చుకుంటూ, వీరి స్నేహం కలకాలం ఇలాగే సాగాలని ఆకాంక్షిస్తున్నారు.

Leave a Reply