తమిళనాడు రామనాథపురం జిల్లాలో మండపాన్ని, రామేశ్వరం ద్వీపాన్ని కలిపే పాంబన్ వంతెనను ఎవరూ మర్చిపోలేరు. 1914లో బ్రిటిష్ కాలంలో నిర్మించిన ఈ వంతెన, భారతదేశపు మొట్టమొదటి సముద్రపు రైల్వే వంతెనగా 108 ఏళ్లకు పైగా నిరంతర సేవలు అందించింది. సముద్రపు ఉప్పు గాలి వల్ల ఇనుప స్తంభాలు తుప్పు పట్టి బలహీనపడటంతో, భద్రతా కారణాల దృష్ట్యా డిసెంబర్ 2022లో దీనిపై రైళ్ల రాకపోకలను శాశ్వతంగా నిలిపివేశారు.
ఈ వంతెన మధ్యలో ఓడలు వెళ్లేందుకు వీలుగా తెరుచుకునే “షెర్జర్ స్పాన్” (Scherzer span) అనే 225 అడుగుల భాగం ఉంది. ఇటీవలే దీనిని చివరిసారిగా తెరవడానికి ప్రయత్నించగా, తుప్పు పట్టడం వల్ల అది కేవలం 15 డిగ్రీల కంటే ఎక్కువ తెరుచుకోలేదు. దీంతో పాత వంతెనను పూర్తిగా తొలగించాలని అధికారులు నిర్ణయించారు. కొత్త పాంబన్ వంతెన నిర్మాణం పూర్తి కావడంతో, పాత వంతెనను తొలగించే పనిని రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ (RVNL) కాంట్రాక్టర్లకు అప్పగించింది. మే 31వ తేదీ వరకు ఈ మార్గంలో పడవలు, ఓడల ప్రయాణాన్ని నిషేధించారు. 111 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ వంతెన జ్ఞాపకాలను మ్యూజియంలో భద్రపరచాలని స్థానికులు కోరుకుంటున్నారు.
