బహదూర్‌ఘర్: హర్యానాలోని ఝజ్జర్ జిల్లా నుండి ఒక భీతిగొల్పే వీడియో వెలుగులోకి వచ్చింది. బహదూర్‌ఘర్‌లోని బాత్రా కాలనీలో వీధిలో ఎండలో కూర్చున్న ఒక వృద్ధురాలిపై ఒక్కసారిగా కోతుల మంద దాడి చేసింది.
మూడు, నాలుగు కోతులు సదరు మహిళ తల, చేతులు మరియు శరీరంలోని ఇతర భాగాలపై కోరలతో కొరకడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. మహిళ అరుపులు విన్న స్థానికులు అక్కడికి చేరుకుని, కేకలు వేస్తూ కోతులను వెళ్లగొట్టారు. అనంతరం కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నప్పటికీ, ఆ ఘటన నుండి ఇంకా కోలుకోలేక తీవ్ర భయాందోళనలో ఉన్నారు.
సీసీటీవీలో రికార్డైన దృశ్యాలు
ఈ భయంకరమైన దాడి సమీపంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యింది. 60 ఏళ్ల సంతోష్ అనే మహిళ తన ఇంటి ముందు కుర్చీలో కూర్చుని ఎండలో సేదతీరుతుండగా, ఆ వీధి గుండా వెళ్తున్న కోతుల మంద ఒక్కసారిగా ఆమెపై విరుచుకుపడింది. ఈ ఘటన డిసెంబర్ 26న జరగగా, ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
కాలనీవాసుల్లో భయాందోళన
ఈ ఘటనతో కాలనీ ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ప్రాంతంలో కోతుల బెడద రోజురోజుకూ పెరుగుతున్నా, నగర పాలక సంస్థ (మున్సిపల్ కౌన్సిల్) ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా అధికారులు తక్షణమే స్పందించి కోతులను పట్టుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
