కర్ణాటక రాష్ట్రంలోని ఒక గ్రామంలో, వ్యవసాయం చేయడానికి ఎద్దులను కానీ, ట్రాక్టర్ వంటి యంత్రాలను కానీ అద్దెకు తీసుకునే ఆర్థిక స్తోమత లేక.. ఒక రైతు తన భార్యనే నాగలికి కట్టి పొలాన్ని దున్నిన హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది.
పేదరికంలో మగ్గుతూ ఆ వృద్ధ దంపతులు చేసిన ఈ వ్యవసాయ దృశ్యం, నేటి సమాజంలోని దయనీయ స్థితికి అద్దం పడుతోంది.
కర్ణాటక రాష్ట్రం, హల్లి ఖేడా గ్రామానికి చెందిన తిప్పణ్ణ ఒక పేద రైతు. అతనికి సొంతంగా ఒక చిన్న వ్యవసాయ భూమి ఉంది. అతని భార్య పేరు సంగమ్మ. ఈ దంపతులు తమకున్న ఆ కాస్త భూమిలోనే వ్యవసాయం చేస్తూ, దాని ద్వారా వచ్చే అరకొర ఆదాయంతోనే ఎంతో కష్టంగా జీవితాన్ని వెళ్లదీస్తున్నారు.
ప్రస్తుతం సాగు సీజన్ ప్రారంభం కావడంతో, తిప్పణ్ణ తన పొలాన్ని దున్నాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ, నేటి ఆధునిక కాలంలో పొలాన్ని దున్నడానికి అవసరమైన ట్రాక్టర్ లేదా రోటవేటర్ వంటి యంత్రాలను అద్దెకు తీసుకోవడానికి కూడా అతని వద్ద డబ్బు లేదు. కనీసం ఎద్దులను అద్దెకు తెచ్చుకునే మార్గం కూడా లేకపోవడంతో, వేరే దారి లేక అతను తన భార్య సహాయాన్ని కోరాడు. భర్త ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకున్న భార్య సంగమ్మ, ఎద్దులకు బదులుగా తనే నాగలి కాడిని భుజాన మోయడానికి ముందుకు వచ్చింది.
దీంతో, భార్యను నాగలికి కట్టి ఆ రైతు తన పొలాన్ని దున్నాడు. చూసేవారి కళ్లల్లో నీళ్లు తెప్పించే ఈ దయనీయ దృశ్యం, సోషల్ మీడియాలో వీడియో రూపంలో విడుదలై ప్రస్తుతం దేశవ్యాప్తంగా కార్చిచ్చులా వ్యాపిస్తోంది. ఈ విషయంపై ఆ దంపతులు కన్నీరుమున్నీరవుతూ మాట్లాడుతూ.. “ఇప్పటివరకు ప్రభుత్వం నుండి మాకు ఎలాంటి సహాయం అందలేదు; ఇకనైనా మా పేదరికాన్ని చూసి ప్రభుత్వం తగిన సాయం అందించాలి” అని ఆవేదనతో వేడుకున్నారు.
