వెంటనే ఇరాన్‌ను విడిచి వెళ్ళండి… దాడులపై అమెరికా కీలక ప్రకటన!

రాబోయే 24 గంటల్లో ఇరాన్‌పై అమెరికా పెద్ద ఎత్తున దాడి చేయబోతోందా? ఇప్పటికే ఆస్ట్రేలియా నుండి న్యూజిలాండ్ వరకు అనేక దేశాలు ఇరాన్‌లో ఉన్న తమ పౌరులను తక్షణమే ఆ దేశాన్ని విడిచి రావాలని ఆదేశించాయి.

తాజాగా అమెరికా చేసిన ప్రకటన ఇప్పుడు అనేక ప్రశ్నలకు తావిస్తోంది. ఇరాన్‌లో గత రెండు వారాలుగా అధికార పాలనకు వ్యతిరేకంగా ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారు. సుమారు 200 నగరాలకు ఈ నిరసనలు పాకాయి. ఇప్పటివరకు జరిగిన ఘర్షణల్లో 544 మంది మరణించారని, 10 వేల మందికి పైగా నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారని సమాచారం. మరణించిన వారిలో నిరసనకారులతో పాటు భద్రతా దళాల జవాన్లు కూడా ఉన్నారు.

రాజధాని టెహ్రాన్‌కు చెందిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వేల సంఖ్యలో ప్రజలు శవపేటికలతో రోడ్లపైకి వస్తున్నారు. కహ్రిజాక్ ఫోరెన్సిక్ మెడికల్ సెంటర్ వెలుపల అనేక మృతదేహాలు బాడీ బ్యాగుల్లో కనిపిస్తున్నాయి.

ఖమేనీ హెచ్చరిక – ట్రంప్ వ్యాఖ్యలు

ప్రదర్శనలను అదుపు చేస్తున్న క్రమంలో తమ భద్రతా దళాలకు చెందిన డజన్ల కొద్దీ జవాన్లు కూడా మరణించారని ఇరాన్ ప్రభుత్వం చెబుతోంది. చనిపోయిన సైనికులకు నివాళిగా ప్రభుత్వం మూడు రోజుల జాతీయ సంతాప దినాలను ప్రకటించింది. మరోవైపు, ఇరాన్ మాజీ షా కుమారుడు రజా పహ్లావి.. నిరసనకారులకు మద్దతు ఇవ్వాలని భద్రతా దళాలకు విజ్ఞప్తి చేశారు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ.. తమ హెచ్చరికల తర్వాత ఇరాన్ ప్రభుత్వం తమతో ఫోన్ ద్వారా సంప్రదింపులు జరిపిందని, చర్చలకు ప్రతిపాదించిందని పేర్కొన్నారు. అయితే, అక్కడ జరుగుతున్న పరిణామాలను బట్టి తాము ముందే చర్యలు తీసుకోవాల్సి రావచ్చని ఆయన హెచ్చరించారు.


Posted

in

by

Tags: