ఏటా: ఉత్తరప్రదేశ్‌లోని ఏటా జిల్లా, నగలా ప్రేమి గ్రామంలో సోమవారం నాడు మృత్యువు తాండవించింది. గుర్తు తెలియని దుండగులు పట్టపగలే ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సభ్యులను తలలు పగులగొట్టి అత్యంత పాశవికంగా హతమార్చారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది.
ఘటన వివరాలు: మృతులలో వృద్ధ దంపతులు, వారి కోడలు మరియు మనవరాలు ఉన్నారు. ఈ హృదయ విదారక ఘటన అప్పుడు వెలుగులోకి వచ్చిందంటే.. ఆ కుటుంబంలోని 10 ఏళ్ల కుమారుడు దేవాన్ష్ స్కూల్ నుండి ఇంటికి తిరిగి వచ్చాడు. తలుపులు తెరిచి ఉండటంతో లోపలికి వెళ్లిన బాలుడు, అక్కడ ఉన్న దృశ్యాన్ని చూసి కేకలు వేస్తూ కుప్పకూలిపోయాడు. ఒక గదిలో తాత గంగా సింగ్ శాక్యా మృతదేహం ఉండగా, మొదటి అంతస్తులో తల్లి రత్న, అక్క జ్యోతి రక్తపు మడుగులో విగతజీవులై పడి ఉన్నారు.
బాలుడి అరుపులు విని పరుగెత్తుకుంటూ వచ్చిన గ్రామస్థులు ఆ భయానక దృశ్యాన్ని చూసి నిశ్చేష్టులయ్యారు. దాడి సమయంలో గంగా సింగ్ భార్య శ్యామా దేవి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుండటంతో పోలీసులు ఆమెను వెంటనే మెడికల్ కాలేజీకి తరలించారు. కానీ చికిత్స పొందుతూ ఆమె కూడా కన్నుమూశారు. దుండగులు ఎంతటి క్రూరత్వానికి ఒడిగట్టారంటే.. ఎవరూ బ్రతకకూడదనే ఉద్దేశంతో అందరి తలలపై బరువైన వస్తువులతో బలంగా కొట్టారు. ఇప్పుడు ఆ కుటుంబంలో ఉద్యోగం నిమిత్తం బయటకు వెళ్లిన పెద్ద కుమారుడు, స్కూల్ నుండి వచ్చిన చిన్నారి దేవాన్ష్ మాత్రమే మిగిలారు.
