ఇండియా వర్సెస్ వెస్టిండీస్ మ్యాచ్ టర్నింగ్ పాయింట్: ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 ఉత్కంఠభరిత సూపర్-8 మ్యాచ్‌లో టీమ్ ఇండియా వెస్టిండీస్‌ను ఓడించి సెమీఫైనల్లోకి ప్రవేశించింది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ నిర్దేశించిన 196 పరుగుల లక్ష్యాన్ని భారత బ్యాటర్లు విజయవంతంగా ఛేదించారు.
షమర్ జోసెఫ్ ఓవర్లో 17 పరుగులు.. అదే టర్నింగ్ పాయింట్!
సంజు శాంసన్ (97 నాటౌట్) అద్భుత ఇన్నింగ్స్ సాయంతో భారత్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ ‘కరో యా మరో’ (గెలిస్తేనే సెమీస్) మ్యాచ్‌లో భారత్ మరో 4 బంతులు మిగిలి ఉండగానే గెలుపొందింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ గట్టి పోటీ ఇచ్చినప్పటికీ, బలహీనమైన బౌలింగ్ కారణంగా మ్యాచ్‌ను చేజార్చుకుంది.
మ్యాచ్ 12వ ఓవర్ వరకు వెస్టిండీస్ పట్టు బిగించింది. కానీ 13వ ఓవర్ మ్యాచ్ గమనాన్ని మార్చేసింది. వెస్టిండీస్ బౌలర్ షమర్ జోసెఫ్ వేసిన ఈ ఓవర్లో సంజు శాంసన్, తిలక్ వర్మ కలిసి 17 పరుగులు రాబట్టారు. ఈ ఓవర్లో మొత్తం నాలుగు ఫోర్లు నమోదయ్యాయి. 12 ఓవర్లకు 103/3గా ఉన్న భారత్ స్కోరు, ఈ ఒక్క ఓవర్ తర్వాత 120కి చేరింది. ఇక్కడి నుండి వెస్టిండీస్ బౌలర్లు ఒత్తిడికి లోనై లయ తప్పారు, దీనికి తోడు వారి పేలవమైన ఫీల్డింగ్ భారత్‌కు కలిసొచ్చింది.
అంతం వరకు అజేయంగా సంజు శాంసన్
ఈ మ్యాచ్‌లో సంజు శాంసన్ ఓపెనర్‌గా వచ్చి చివరి వరకు క్రీజులో నిలబడటం విశేషం. ఆయన కేవలం 50 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సర్లతో 97 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు. టీ20 ప్రపంచకప్‌లో లక్ష్య ఛేదనలో ఒక భారత బ్యాటర్ చేసిన అత్యధిక స్కోరుగా సంజు రికార్డు సృష్టించారు. టోర్నీ ఆరంభంలో ఫామ్ లేమితో జట్టుకు దూరమైన సంజు, జింబాబ్వేపై పునరాగమనం చేసి, ఇప్పుడు ఈడెన్ గార్డెన్స్‌లో చారిత్రాత్మక ఇన్నింగ్స్‌తో మేనేజ్మెంట్ నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు.
సెమీఫైనల్లో ఇంగ్లాండ్‌తో భారత్ పోరు
సూపర్-8లో దక్షిణాఫ్రికా చేతిలో ఓడిపోయిన తర్వాత భారత్ సెమీస్ చేరడం కష్టమనిపించింది. కానీ వరుసగా జింబాబ్వే మరియు వెస్టిండీస్‌లపై గెలిచి సెమీస్ టికెట్ ఖరారు చేసుకుంది. మార్చి 5న ముంబైలోని వాంఖడే స్టేడియంలో భారత్, ఇంగ్లాండ్‌తో సెమీఫైనల్ మ్యాచ్ ఆడనుంది.
