ఉత్తరప్రదేశ్లోని బల్లియా నుండి బీహార్కు వెళ్లిన ఒక పెళ్లి బృందం (బారాత్)లో ఘోరం జరిగింది. వరుడి ముందే ఒక ఉన్మాది వధువుపై కాల్పులు జరిపాడు. జయమాల (దండలు మార్చుకునే) కార్యక్రమం జరుగుతుండగా ఈ దారుణం చోటుచేసుకుంది. నిందితుడు వధువు పొత్తికడుపులో కాల్పులు జరిపి పరారయ్యాడు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో వారణాసిలోని ట్రామా సెంటర్కు తరలించారు.
సంఘటన వివరాలు: బల్లియా జిల్లా బైరియా పోలీస్ స్టేషన్ పరిధిలోని సురేమన్పూర్ గ్రామం నుండి పెళ్లి బృందం బీహార్లోని బక్సర్ జిల్లా ముఫాసిల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మలా టోలీకి చేరుకుంది. ద్వార పూజ కార్యక్రమం ముగిసిన తర్వాత, వేదికపై జయమాల కార్యక్రమం మొదలైంది.
వధువు ఆర్తి, వరుడికి దండ వేయబోతుండగా.. పక్కింటికి చెందిన దీనబంధు అనే యువకుడు ఒక్కసారిగా తుపాకీతో కాల్పులు జరిపాడు. వధువు కుప్పకూలడంతో పెళ్లి పందిరిలో తొక్కిసలాట జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తీవ్ర రక్తస్రావమైన వధువును వెంటనే ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో వైద్యులు ఆమెను వారణాసికి రిఫర్ చేశారు.
నిరాశతో వెనుతిరిగిన వరుడు: ఈ దారుణంతో పెళ్లి ఆగిపోయింది. వివాహం కాకుండానే బారాత్ బక్సర్ నుండి తిరిగి బల్లియాకు చేరుకుంది. వరుడి కుటుంబం తీవ్ర నిరాశలో మునిగిపోయింది. వధువు తండ్రి మరియు కుటుంబ సభ్యులు షాక్లో ఉన్నారు.
నిందితుడి కోసం గాలింపు: సమాచారం అందుకున్న బీహార్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. నిందితుడు దీనబంధు ఆమెను ఏకపక్షంగా ప్రేమిస్తున్నాడని, అందుకే ఈ దారుణానికి ఒడిగట్టాడని ప్రాథమిక విచారణలో తెలిసింది. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉండటంతో అతని కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనతో గ్రామంలో భయాందోళనలు నెలకొన్నాయి.
