పెళ్లి వేడుక అంటే వందలాది మంది అతిథులు, భారీ ఏర్పాట్లు, అంగరంగ వైభవంగా జరిగే సంబరాలు గుర్తుకొస్తాయి. కానీ ముంబైకి చెందిన క్రిషా కొఠారి, వరిల్ షా అనే జంట మాత్రం అందుకు భిన్నంగా ఆలోచించింది. కేవలం ఎనిమిది మంది అతిథుల సమక్షంలో ఎంతో నిరాడంబరంగా, ఆత్మీయుల మధ్య తమ వివాహ వేడుకను జరుపుకుంది.
అరేబియా సముద్రానికి ఎదురుగా ఉన్న తమ ఇంటి మేడపైనే ఈ జంట పెళ్లి చేసుకుంది. పెద్ద కల్యాణ మండపాలు, ఖరీదైన హోటళ్లను ఎంచుకోకుండా.. సాయంత్రం వేళ అస్తమించే సూర్యుడు, సముద్రపు అలలు, నగర అందాల మధ్య తమ ఇంటి టెర్రస్‌నే పెళ్లి వేదికగా మార్చుకుంది. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
ఈ వేడుకలో వధువు ఎరుపు, బంగారు రంగుల చీరలో మెరిసిపోగా.. వరుడు తెలుపు, బంగారు రంగుల దుస్తుల్లో కనిపించాడు. తెల్లని పూలు, కొవ్వొత్తులతో అలంకరించిన చిన్న వేదిక ఎంతో అందంగా కనిపించింది. చుట్టూ ఉన్న ఎనిమిది మంది అతిథులు చప్పట్లు కొడుతూ ఈ జంటను ఆశీర్వదించారు.
ఆడంబరాలకు ప్రాధాన్యం ఇవ్వకుండా.. జీవితంలో తమకు అత్యంత దగ్గరైన వ్యక్తుల సమక్షంలో పెళ్లి చేసుకోవాలన్న ఈ జంట నిర్ణయం నెటిజన్లను ఆకట్టుకుంటోంది. వేలాది మందిని ఆహ్వానించడం కంటే, మనసుకు దగ్గరైన వారితో ఆనందాన్ని పంచుకోవడమే వివాహ వేడుకలోని అసలైన అందమని పలువురు కామెంట్లు చేస్తున్నారు. ఈ కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Leave a Reply