వివాహ బంధంలో ఉన్న ఒక వ్యక్తి, తన భాగస్వామికి తెలియకుండా లేదా భాగస్వామికి దూరంగా ఉంటూ మరొకరితో ‘లివ్-ఇన్’ (Live-in relationship) పద్ధతిలో జీవించడం నేరం కాదని అలహాబాద్ హైకోర్టు అత్యంత కీలకమైన తీర్పునిచ్చింది.
ఇప్పటికే వివాహమైన వ్యక్తి మరొక వ్యక్తితో కలిసి జీవించడం సామాజికంగా తప్పగా అనిపించినప్పటికీ, భారత శిక్షాస్మృతి (IPC) ప్రకారం అది క్రిమినల్ నేరం కాదని కోర్టు స్పష్టం చేసింది. ఒక పురుషుడు మరియు స్త్రీ పరస్పర అంగీకారంతో కలిసి జీవించడం వారి వ్యక్తిగత స్వేచ్ఛ అని, ఇందులో చట్టం జోక్యం చేసుకోలేదని న్యాయమూర్తులు పేర్కొన్నారు.
ముఖ్యంగా, తమకు రక్షణ కల్పించాలని కోరుతూ కోర్టును ఆశ్రయించిన ఒక జంట పిటిషన్‌ను విచారించిన సందర్భంగా.. వారు చట్టబద్ధంగా వివాహం చేసుకోకపోయినా, కలిసి జీవించే హక్కు వారికి ఉందని కోర్టు పచ్చజెండా ఊపింది. ఇటువంటి సంబంధాలు నైతిక పరంగా చర్చనీయాంశం కావచ్చు, కానీ వాటిని చట్టం ముందు నేరంగా నిలబెట్టలేమని ఈ తీర్పు సారాంశం.
