హాంగ్‌కాంగ్: హాంగ్‌కాంగ్‌లో తన ప్రియురాలిని దారుణంగా హత్య చేసి, ఆపై శవాన్ని ఒక వీల్బోర్డ్ పై పెట్టి వీధిలో తరలించేందుకు ప్రయత్నించిన కేసులో.. 29 ఏళ్ల ఎన్గ్ కా-సింగ్ అనే యువకుడిపై హైకోర్టులో విచారణ తీవ్రతరమైంది.
‘సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్’ నివేదిక ప్రకారం.. గత 2022వ సంవత్సరంలో తన 30 ఏళ్ల ప్రియురాలైన ‘యిప్’ మరణానికి తానే కారణమని నిందితుడు అంగీకరించాడు. అయితే, ఇది తాను పక్కా ప్లాన్‌తో చేసిన హత్య కాదని.. ఆమె శరీర బరువు (వెయిట్) తగ్గించడంలో సహాయం చేయడానికి ఇనుప రాడ్‌తో కొడుతున్న సమయంలో ప్రమాదవశాత్తూ ఆమె చనిపోయిందని నిందితుడు కోర్టులో వింత వాదనలు చేశాడు.
నిజాలు దాచే ప్రయత్నం – తిరస్కరించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్:
అయితే, మరణించిన మహిళ శరీరంలో 55 శాతానికి పైగా తీవ్రమైన గాయాలు, కాలిపోయిన మచ్చలు ఉన్నాయని.. నిందితుడు అసలు నిజాలను దాచిపెట్టి తప్పుడు కథ అల్లుతున్నాడని సీనియర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ‘ఆడ్రీ పర్వానీ’ కోర్టులో నిందితుడి వాదనను తీవ్రంగా ఖండించారు.
దుప్పటితో చుట్టబడిన శవాన్ని నిందితుడు వీధిలో తీసుకెళ్తుండగా, లోపలి నుండి మహిళ కాలు బయటకు రావడాన్ని గమనించిన ఒక బాటసారుడు పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో నిందితుడు ఎన్గ్ కా-సింగ్ పోలీసులకు దొరికిపోయాడు. కోర్టులో తక్కువ శిక్ష పడేలా చట్టంలోని లొసుగులను వాడుకోవాలని నిందితుడు ప్రయత్నించినప్పటికీ.. ప్రాసిక్యూషన్ మాత్రం దీనిని తీవ్రమైన హత్య కేసుగానే పరిగణిస్తూ విచారణను ముమ్మరంగా కొనసాగిస్తోంది.
