మహారాష్ట్రలోని పుణె పరిధిలోని యెరవాడ ప్రాంతంలో, “నా లవర్‌ను ఎందుకు చూశావు?” అనే చిన్న కారణంతో ఒక యువకుడిని నడిరోడ్డుపై పరుగులు పెట్టించి పదునైన ఆయుధాలు, కర్రలతో అతికిరాతకంగా నరికిన ఘటన తీవ్ర కలకలం రేపింది.
బాధితుడు తన ప్రియురాలిని చూశాడన్న అనుమానంతో ఒక పోకిరీ యువకుడు అతడిని అడ్డగించి గొడవకు దిగాడు. మాటామాటా పెరగడంతో తన మైనర్ స్నేహితుల గ్యాంగ్‌ను రప్పించి.. నడిరోడ్డుపై ఆ యువకుడిని వెంటాడి పదునైన కత్తులు, కర్రలతో విచక్షణారహితంగా దాడి చేశాడు.
జనసంచారం ఉన్న ప్రధాన రహదారిపైనే ఈ రక్తపాతం జరగడం గమనార్హం. బాధితుడు రక్తపు మడుగులో కుప్పకూలిపోవడంతో ఆ ముఠా అక్కడి నుంచి పరారైంది. ఈ దారుణంపై కేసు నమోదు చేసుకున్న యెరవాడ పోలీసులు.. పరారీలో ఉన్న మైనర్ నిందితుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.
