కాన్పూర్: ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ పంకీ ప్రాంతంలో ఒక సంచలన కేసు వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియాలో పేరు మార్చుకుని, ఇద్దరు మహిళలను ప్రేమజాలంలో పడేసి, వారిని పెళ్లి చేసుకుని, ఆపై బలవంతంగా మతమార్పిడికి ఒత్తిడి తెచ్చినందుకు ఒక వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఏం జరిగింది?: హర్దోయ్ ప్రాంతానికి చెందిన మొదటి బాధితురాలికి ఎనిమిదేళ్ల క్రితం ఇన్స్టాగ్రామ్ ద్వారా ఒక యువకుడితో పరిచయం ఏర్పడింది. తాను ‘విశాల్’ అని చెప్పి, ఆమెను నమ్మించి మొదట ఆలయంలో, తర్వాత కోర్టులో వివాహం చేసుకున్నాడు. పెళ్లయ్యాక తన అసలు పేరు ‘ఇర్షాద్’ అని బయటపెట్టాడు. 2023లో వారికి కొడుకు పుట్టిన తర్వాత, ఇర్షాద్ ప్రవర్తనలో మార్పు వచ్చింది. బిడ్డకు ‘ఖత్నా’ (సున్నతి) చేయాలని, మాంసం తినాలని, నమాజ్ చేయాలని, చివరకు మతం మారాలని శారీరకంగా, మానసికంగా వేధించడం ప్రారంభించాడు.
రెండో బాధితురాలి రాకతో బయటపడ్డ అసలు విషయం: ఈ కేసులో మరో ట్విస్ట్ ఏంటంటే, ప్రస్తుతం మూడు నెలల గర్భిణిగా ఉన్న మరో మహిళ ముందుకు వచ్చింది. నిందితుడికి అప్పటికే మరో పెళ్లి జరిగిందని, అతని అసలు పేరు ఇర్షాద్ అని ఆమెకు తెలియదు. నిందితుడు ఆమెను కూడా నమ్మించి పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరు భార్యలను ఒకే ఇంట్లో ఉంచుతూ, నిత్యం వేధింపులకు గురిచేసేవాడు.
పోలీసుల చర్య: వేధింపులు భరించలేక బుధవారం రెండో బాధితురాలు భజరంగదళ్ కార్యకర్తలకు సమాచారం అందించింది. వారు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, పంకీ పోలీసులు రంగంలోకి దిగి బాధితులిద్దరినీ రక్షించి, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
పంకీ అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ అమిత్ చౌరసియా మాట్లాడుతూ.. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, అన్ని సాక్ష్యాధారాలను పరిశీలిస్తూ లోతుగా విచారణ జరుపుతున్నామని తెలిపారు.
