2012లో చైనా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన షీ జిన్‌పింగ్‌ను గద్దె దించడానికి ఇప్పటివరకు నాలుగుసార్లు ప్రయత్నాలు జరిగాయని ప్రచారం జరుగుతోంది. తాజాగా చైనాకు చెందిన ఇద్దరు సీనియర్ సైనిక అధికారులు, జనరల్ జాంగ్ యుయ్షా మరియు జనరల్ లీ జెన్లీలను అవినీతి మరియు క్రమశిక్షణా ఉల్లంఘనల ఆరోపణలపై అరెస్ట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. వీరి కుటుంబాలను కూడా బందీలుగా తీసుకున్నట్లు సమాచారం.
తిరుగుబాటుకు వ్యూహం: చైనా రచయిత షెంగ్ షయ్ కథనం ప్రకారం.. జనవరి 18న బీజింగ్‌లోని జింగ్షీ హోటల్లో షీ జిన్‌పింగ్ బస చేయాల్సి ఉంది. జిన్‌పింగ్ తన భద్రత కోసం తరచుగా నివాస ప్రాంతాలను మారుస్తూ ఉంటారు. అయితే ఆ రాత్రి ఆయనను అక్కడే బందీగా పట్టుకుని, అధికారాన్ని హస్తగతం చేసుకోవాలని జాంగ్ వర్గం ప్లాన్ చేసింది.
సమాచారం లీక్ – ఎదురుదాడి: ఆపరేషన్ ప్రారంభానికి రెండు గంటల ముందే ఈ విషయం జిన్‌పింగ్‌కు తెలిసిపోయింది. ఆయన తన కార్యక్రమాన్ని రద్దు చేసుకుని హోటల్ నుండి వెళ్లిపోయారు. తిరుగుబాటుదారులు ప్లాన్ ప్రకారం హోటల్‌కు చేరుకోగా, అక్కడ జిన్‌పింగ్ భద్రతా బలగాలకు మరియు జాంగ్ అనుచరులకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఘర్షణలో జిన్‌పింగ్ వ్యక్తిగత భద్రతా దళానికి చెందిన 9 మంది సిబ్బందితో పాటు పలువురు తిరుగుబాటుదారులు మరణించినట్లు సమాచారం.
సైనిక ప్రక్షాళన (Military Purge): ఈ ఘటన తర్వాత జిన్‌పింగ్ తన అత్యంత సన్నిహితులపై కూడా నిఘా పెంచారు.సైన్యంపై పూర్తి నియంత్రణ సాధించడానికి, తన రాజకీయ ప్రత్యర్థులను తొలగించడానికి ఆయన ఈ ‘సైనిక ప్రక్షాళన’ను ఒక ఆయుధంగా వాడుకుంటున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం జాంగ్ యుయ్షా మరియు లీ జెన్లీలు జైలులో ఉన్నట్లు, బయటి ప్రపంచానికి ఈ విషయాలు తెలియకుండా చైనా ప్రభుత్వం జాగ్రత్త పడుతున్నట్లు నివేదిక పేర్కొంది.
