మధ్యప్రదేశ్ రాష్ట్రం సిద్ధి జిల్లాలో ఓ ప్రభుత్వ అధికారి అమానవీయ, అధికార దర్పానికి సంబంధించిన షాకింగ్ వీడియో ఒకటి వెలుగులోకి వచ్చి తీవ్ర దుమారం రేపుతోంది.
మాధా గ్రామ పంచాయతీ పరిధిలో విధులు నిర్వర్తిస్తున్న పట్వారీ (రెవెన్యూ అధికారి) నీలేశ్ నామ్దేవ్ అనే యువ అధికారి, ఆ ప్రాంతంలోని ఒక చిన్న వాగును దాటడానికి ప్రయత్నించాడు.
ఆ సమయంలో తన బూట్లు, బట్టలు నీటిలో తడవకూడదనే ఉద్దేశంతో, అక్కడే ఉన్న లాల్బా కేవత్ అనే 65 ఏళ్ల వృద్ధుడి భుజాలపై ఎక్కి కూర్చుని గుర్రంలా స్వారీ చేస్తూ ఆ వాగును దాటాడు. ఈ అమానవీయ ఘటనను అక్కడున్న కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో, అది కాస్తా వైరల్గా మారి తీవ్ర ఆగ్రహావేశాలకు దారితీసింది.
బ్రిటిష్ కాలం నాటి దొరతనాన్ని తలపించేలా సాగిన ఈ చర్యపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రామస్తులు, కలెక్టరేట్తో పాటు ప్రజా సమస్యల పరిష్కార వేదిక (జనశున్వాయి) వద్దకు చేరుకుని ఫిర్యాదు చేశారు. వృద్ధుడిని అవమానించి, మానవత్వం లేకుండా ప్రవర్తించిన ఆ ప్రభుత్వ అధికారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.
