కొత్త కారు కొన్నప్పుడు ఆ సంతోషం మాటల్లో చెప్పలేం. కానీ, షోరూమ్ గేటు దాటగానే కారు యాక్సిడెంట్ అయితే పరిస్థితి ఏంటి? డెలివరీ తీసుకున్న కొద్ది సెకన్లకే కారు ప్రమాదానికి గురైన ఘటనలు ఇటీవల చాలా చోట్ల జరిగాయి. ఇలాంటప్పుడు ఇన్సూరెన్స్ క్లెయిమ్ వస్తుందా లేదా అన్నది ప్రతి యజమానిని వేధించే అతిపెద్ద ప్రశ్న.
మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం, మీరు డెలివరీ పేపర్లపై సంతకం చేసిన క్షణం నుండే కారుకు సంబంధించిన చట్టపరమైన బాధ్యత మీదే అవుతుంది. ఇన్సూరెన్స్ యాక్టివ్‌గా ఉంటేనే కారు షోరూమ్ దాటి బయటకు వస్తుంది. కాబట్టి, సాంకేతికంగా మీకు క్లెయిమ్ రావాలి. కానీ ఇందులో కొన్ని క్లిష్టమైన విషయాలు కూడా ఉన్నాయి.
ఇన్సూరెన్స్ కంపెనీల నిబంధనలు: క్లెయిమ్ ఎప్పుడు వస్తుంది? ప్రస్తుత నిబంధనల ప్రకారం, చెల్లుబాటు అయ్యే ఇన్సూరెన్స్ లేకుండా ఏ కారును షోరూమ్ నుండి బయటకు తీసుకురాకూడదు. చాలా మంది డీలర్లు డెలివరీకి ముందే ‘జీరో డిప్రిసియేషన్’ (Zero Depreciation) పాలసీని యాక్టివేట్ చేస్తారు. అంటే, కారు షోరూమ్ గేటు దాటిన క్షణం నుండే ఇన్సూరెన్స్ కవర్ ప్రారంభమవుతుంది. ఈ సమయంలో ప్రమాదం జరిగితే, నష్టాన్ని ఇన్సూరెన్స్ కంపెనీ భర్తీ చేయాలి. మీరు కేవలం పాలసీలో పేర్కొన్న స్వల్ప మొత్తాన్ని (Deductible Amount) మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది.
రిజిస్ట్రేషన్ లేకపోతే క్లెయిమ్ రాదు: ఇన్సూరెన్స్ ఉన్నప్పటికీ, కారుకు ‘RTO రిజిస్ట్రేషన్’ లేకపోతే మీ క్లెయిమ్ తిరస్కరించబడే అవకాశం ఉంది. రిజిస్ట్రేషన్ నంబర్ లేకుండా పబ్లిక్ రోడ్లపై కారును నడపడం చట్టరీత్యా నేరం. ఇటీవల ఒక కేసులో, రిజిస్ట్రేషన్ నంబర్ లేని కారణంగా ఇన్సూరెన్స్ కంపెనీ క్లెయిమ్‌ను తిరస్కరించగా, దానిని కన్స్యూమర్ కమిషన్ సమర్థించింది. డీలర్ నిర్లక్ష్యం వల్ల రిజిస్ట్రేషన్ కాకుండానే కారు అప్పగిస్తే, డీలర్‌పై జరిమానా వేయవచ్చు కానీ, నష్టాన్ని మాత్రం కస్టమరే భరించాల్సి రావచ్చు.
షోరూమ్ సిబ్బంది తప్పు ఉంటే: డెలివరీ ప్రక్రియ పూర్తి కాకముందే, షోరూమ్ సిబ్బంది లేదా డ్రైవర్ కారును బయటకు తీసుకొస్తుండగా యాక్సిడెంట్ జరిగితే, దానికి పూర్తి ఆర్థిక మరియు చట్టపరమైన బాధ్యత షోరూమ్ (డీలర్)దే. అటువంటి సందర్భంలో కస్టమర్ నష్టాన్ని భరించాల్సిన అవసరం లేదు.
ప్రమాదం జరిగినప్పుడు వెంటనే చేయాల్సిన పనులు:
- వెంటనే తెలియజేయండి: యాక్సిడెంట్ జరిగిన వెంటనే మీ ఇన్సూరెన్స్ కంపెనీకి మరియు డీలర్‌కు సమాచారం ఇవ్వండి.
- సాక్ష్యాలను సేకరించండి: కారుకు జరిగిన నష్టాన్ని ఫోటోలు లేదా వీడియోలు తీసుకోండి.
- FIR దాఖలు చేయండి: ప్రమాదంలో వేరే వ్యక్తులకు లేదా ఆస్తికి నష్టం వాటిల్లితే, క్లెయిమ్ కోసం ఎఫ్.ఐ.ఆర్ (FIR) తప్పనిసరి.
