బీహార్ రాష్ట్ర సచివాలయ ప్రాంగణంలోనే నకిలీ అధికారి, నకిలీ కానిస్టేబుల్ అవతారమెత్తిన ఇద్దరు బావాబావమరుదులను పోలీసులు చాకచక్యంగా అరెస్ట్ చేశారు.
ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఏకంగా సచివాలయం లోపలే కూర్చుని నకిలీ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్న ఈ భారీ మోసం అధికార వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది.
రాష్ట్ర సచివాలయ సాంఘిక సంక్షేమ శాఖ విభాగంలో ఓ వ్యక్తి మొబైల్ వీడియో కాల్ ద్వారా పలువురు అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నాడు. అతడి పక్కనే ఖాకీ యూనిఫాంలో ఉన్న మరొక వ్యక్తి భద్రతా సిబ్బందిలా కాపలాగా నిలబడ్డాడు. అంతేకాకుండా, అక్కడ ‘సీడీపీవో రిక్రూట్మెంట్’ (CDPO Recruitment) అనే బోర్డు కూడా ఏర్పాటు చేశారు. ఈ తతంగాన్ని గమనించిన అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (ASO) రాజ్నాథ్ సింగ్కు అనుమానం రావడంతో, ఆయన తక్షణమే పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకుని ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు జరిపిన ప్రాథమిక విచారణలో.. ఆరోగ్య శాఖ విభాగపు అధికారిలా నటిస్తున్న వ్యక్తిని అజయ్గా, కానిస్టేబుల్ యూనిఫాంలో నిలబడిన వ్యక్తిని అతడి బావమరిది రాజ్కుమార్గా గుర్తించారు. నిరుద్యోగులను సులభంగా నమ్మించడం కోసమే స్వయంగా సచివాలయం లోపలికి వచ్చి, బావమరిదికి పోలీస్ యూనిఫాం వేసి పక్కన నిలబెట్టి, అజయ్ ఈ నకిలీ వీడియో కాల్ ఇంటర్వ్యూలను నడిపించినట్లు బట్టబయలైంది.
నిందితుల వద్ద సోదాలు చేయగా.. భారీ సంఖ్యలో నకిలీ నియామక పత్రాలు (Fake Appointment Letters), నకిలీ సర్టిఫికెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఆ నకిలీ పత్రాలపై సీనియర్ ఐఏఎస్ అధికారులు డా. ఎస్. సిద్ధార్థ్, ఆనంద్ కిషోర్ పేర్లతో ఫోర్జరీ సంతకాలు చేసినట్లు విచారణలో తేలింది. ప్రభుత్వ ప్రధాన సచివాలయం లోపల ఇంటర్వ్యూలు నిర్వహిస్తే అభ్యర్థులు అనుమానించకుండా సులభంగా నమ్మి డబ్బులు ఇస్తారనే దురుద్దేశంతోనే ఈ పక్కా ప్లాన్ వేసినట్లు నిందితులు అంగీకరించారు.
ప్రస్తుతం అజయ్, అతని బావమరిది రాజ్కుమార్లను అరెస్ట్ చేసిన పాట్నా సెంట్రల్ ఎస్పీ (SP) మమతా కళ్యాణి నేతృత్వంలోని పోలీస్ బృందం లోతైన దర్యాప్తు చేపట్టింది. ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో వీరు ఇప్పటివరకు ఎంతమంది నుంచి కోట్ల రూపాయలు వసూలు చేశారు, ఈ ఉద్యోగ ముఠా వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో పోలీసులు విచారణ ముమ్మరం చేశారు.
