అమెరికా మరియు ఇరాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ, సముద్రంలో ఏర్పాటు చేసే మందుపాతరల (Naval Mines) గురించి చర్చ జోరందుకుంది. తమ నౌకల ద్వారా ఈ మందుపాతరలను శుభ్రం చేస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. అంతేకాకుండా, హార్ముజ్ జలసంధిలో (Strait of Hormuz) ఏదైనా ఇరాన్ నౌక మందుపాతరలు వేస్తూ కనిపిస్తే, దానిని వెంటనే ధ్వంసం చేయాలని అమెరికా ఆదేశాలు జారీ చేసింది.
నిజానికి, ఈ రకమైన మందుపాతరలు నిమిషాల్లో ఎంతటి భారీ నౌకనైనా తుత్తునియలు చేయగలవు. ప్రపంచవ్యాప్తంగా జరిగే పెట్రోలియం వ్యాపారంలో 20 శాతం హార్ముజ్ మార్గం ద్వారానే జరుగుతుంది. చమురు అనేది అత్యంత త్వరగా మంటలు అంటుకునే పదార్థం కాబట్టి, ఈ మైన్స్ వల్ల భారీ ముప్పు పొంచి ఉంది.
సముద్రపు మందుపాతరలు అంటే ఏమిటి? నీటి లోపల కూడా పేలగల సామర్థ్యం ఉన్న పేలుడు పరికరాలను ‘నేవల్ మైన్స్’ అంటారు. వీటిని మొదటిసారిగా 14వ శతాబ్దంలో ఉపయోగించారు. సముద్రపు దొంగలను అరికట్టడానికి చైనా వీటిని వాడేది. మొదటి ప్రపంచ యుద్ధంలో కూడా వీటిని విరివిగా ఉపయోగించారు. ఈ మైన్స్ ద్వారా శత్రు నౌకలను లక్ష్యంగా చేసుకుని దాడి చేస్తారు.
వీటిని ఎలా ఏర్పాటు చేస్తారు? సముద్రంలో వేసే మైన్స్ అనేక రకాలుగా ఉంటాయి:
- కాంటాక్ట్ మైన్స్ (Contact Mines): ఇవి ఏదైనా నౌకను తాకిన వెంటనే పేలిపోతాయి. ఇవి సాధారణంగా సముద్ర గర్భంలో యాంకర్లకు (Anchor) కట్టబడి ఉంటాయి.
- కంట్రోల్డ్ మైన్స్: వీటిని ప్రోగ్రామ్ చేస్తారు. వీటి పేలుడును రిమోట్ ద్వారా నియంత్రించవచ్చు.
- ఇన్‌ఫ్లుయెన్స్ మైన్స్ (Influence Mines): ఇవి అయస్కాంత తరంగాలు (Magnetic), నీటి పీడనం (Pressure) లేదా శబ్దాన్ని గుర్తించి పేలుతాయి. ఇవి సముద్రపు అడుగు భాగంలో ఉంటాయి.
- లింపెట్ మైన్స్: ఇవి చిన్న పరిమాణంలో ఉండి, రహస్యంగా వెళ్లి శత్రు నౌకలకు అతికిస్తారు.
అమెరికా వాదన ప్రకారం ఇరాన్ హార్ముజ్ జలసంధిలో సుమారు ఆరు వేల మైన్స్ వేసింది. అయితే, వీటి కచ్చితమైన సంఖ్యను చెప్పడం సాధ్యం కాదని నిపుణులు అంటున్నారు.
గుర్తించడం అత్యంత కఠినం: సముద్రంలో ఈ మందుపాతరలను కనిపెట్టడం చాలా కష్టం. ఇవి నీటి పైన తేలుతూ ఉండొచ్చు లేదా లోపల ఎక్కడో దాగి ఉండొచ్చు. సముద్రపు అలల ఉధృతికి వీటి స్థానాలు మారుతూ ఉంటాయి. వీటిని తొలగించిన తర్వాత కూడా పేలుడు పదార్థాల అవశేషాలు ఉంటే మళ్ళీ ప్రమాదం సంభవించే అవకాశం ఉంది. సాధారణంగా వీటిని గుర్తించడానికి ‘సోనార్’ (SONAR) టెక్నాలజీని ఉపయోగిస్తారు.
