మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో ఒక సంచలన ఘటన వెలుగుచూసింది. థాటిపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తృప్తి నగర్లో ఒక కుటుంబ వేడుకలో జరిగిన ‘హర్ష్ ఫైరింగ్’ (సంబరాల్లో గాలిలోకి కాల్పులు జరపడం) ఒక మహిళ ప్రాణాలను బలిగొంది.
మహిళ మరణించిన తర్వాత, పోలీసులకి దొరికిపోతామన్న భయంతో అత్తవారింటి వారు మృతదేహాన్ని డీప్ ఫ్రీజర్లో దాచిపెట్టి, రాత్రికి రాత్రే అంత్యక్రియలు పూర్తి చేయాలని ప్లాన్ చేశారు. అయితే, పొరుగువారికి అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించడంతో ఈ దారుణం బయటపడింది.
ఏం జరిగింది? తృప్తి నగర్లో నివసించే కుష్వాహ కుటుంబంలో ఒక వేడుక జరుగుతుండగా, మృతురాలు జ్యోతి కుష్వాహ మరిది యోగేష్ కుష్వాహ తుపాకీతో గాలిలోకి కాల్పులు జరుపుతున్నాడు. ఈ క్రమంలో అనుకోకుండా తూటా జ్యోతికి తగలడంతో ఆమె అక్కడికక్కడే మరణించింది.
నిజం దాచడానికి ప్రయత్నం: జ్యోతి మరణించిన తర్వాత, భర్త మనోజ్ కుష్వాహ, మరిది యోగేష్ మరియు కుటుంబ సభ్యులు నిజం దాచాలని నిర్ణయించుకున్నారు. జ్యోతి చప్పై పై నుంచి పడి చనిపోయిందని ఆమె పుట్టింటి వారికి అబద్ధం చెప్పారు. మృతదేహాన్ని బయటకు కనిపించకుండా డీప్ ఫ్రీజర్ను తెప్పించి, అందులో పెట్టి దాచారు. రాత్రివేళ రహస్యంగా అంత్యక్రియలు చేయాలని ప్లాన్ చేశారు. కానీ, రాత్రివేళ ఇంటికి డీప్ ఫ్రీజర్ రావడం చూసి పొరుగువారికి అనుమానం వచ్చింది. వారు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వచ్చి తనిఖీ చేయగా, ఫ్రీజర్లో జ్యోతి మృతదేహం బయటపడింది.
“అందులో తూటా లేదనుకున్నా” పోలీసుల విచారణలో భర్త మనోజ్ నిజం ఒప్పుకున్నాడు. నిందితుడు యోగేష్ ఘటనా స్థలం నుంచి పారిపోగా, పోలీసులు అతడిని అరెస్టు చేశారు. విచారణలో యోగేష్ మాట్లాడుతూ, “తుపాకీలో తూటా లేదనుకున్నాను. సరదాగా వదిన వైపు గురిపెట్టి ట్రిగ్గర్ నొక్కాను, కానీ అది పేలింది” అని తెలిపాడు.
హత్యగా పుట్టింటి వారి ఆరోపణ: ఈ ఘటనపై మృతురాలి పుట్టింటి వారు పోలీసులకు ఫిర్యాదు చేస్తూ, ఇది ముమ్మాటికీ హత్యేనని ఆరోపించారు. పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. సాక్ష్యాలను తారుమారు చేసినందుకు మరియు మృతదేహాన్ని దాచిపెట్టినందుకు భర్త మరియు కుటుంబ సభ్యులపై కూడా కేసులు నమోదు చేశారు.
