ఢిల్లీ: పొరుగు దేశాలైన చైనా మరియు బంగ్లాదేశ్ నుండి ఎదురవుతున్న సవాళ్ల నేపథ్యంలో, పశ్చిమ బెంగాల్‌లోని ‘చికెన్స్ నెక్’ (కోడి మెడ) ప్రాంతంలో 40 కిలోమీటర్ల పొడవైన భూగర్భ రైల్వే సొరంగం నిర్మాణ పనులను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఈ ప్రాజెక్టు ఆ రెండు దేశాలను ఆందోళనలో పడేసింది. ఈ ప్రాజెక్టు ఎందుకు ముఖ్యం? అసలు ‘చికెన్స్ నెక్’ అంటే ఏమిటి? వివరంగా చూద్దాం.
భారతమాత రెండు చేతులలో ఒకటిగా వెలుగొందే ఈశాన్య రాష్ట్రాలను (North-East States), దేశ హృదయంతో అనుసంధానించే జీవనరేఖ ఏదో తెలుసా? అదే సిలిగురి కారిడార్… ప్రపంచ దేశాలన్నీ దీనిని ‘చికెన్స్ నెక్’ అని పిలుస్తాయి. ఇది మన దేశంలో అత్యంత కీలకమైన భూభాగం.
కేవలం 22 కిలోమీటర్ల వెడల్పు మాత్రమే ఉన్న ఈ మార్గాన్ని ఎలాగైనా కత్తిరించి భారత్ నుండి ఈశాన్య రాష్ట్రాలను వేరు చేయాలని చూస్తున్న శత్రు దేశాలకు సింహస్వప్నంలా భారత ప్రభుత్వం ఒక భారీ ప్రాజెక్టును చేపట్టింది. అదే.. భూమి అడుగున సుమారు 40 కిలోమీటర్ల పొడవైన భారీ రైల్వే సొరంగం.
పశ్చిమ బెంగాల్‌లోని టిన్ మైల్ హాట్ (Tin Mile Haat) నుండి రంగాపాని (Rangapani) వరకు, సుమారు 24 మీటర్ల లోతులో ఈ రైల్వే లైన్ నిర్మించనున్నారు. ఒకవైపు చైనా ముప్పు, మరోవైపు బంగ్లాదేశ్‌లో మారుతున్న రాజకీయ పరిస్థితులు.. ఇలా అన్ని వైపుల నుండి వచ్చే సవాళ్లను తిప్పికొట్టేలా ఈ అండర్‌గ్రౌండ్ వ్యూహాన్ని రూపొందించారు.
పైనుండి బాంబుల వర్షం కురిసినా, క్షిపణులు దాడి చేసి ఉపరితలాన్ని ధ్వంసం చేసినా, భూమి అడుగున భారత సైన్యానికి చెందిన యుద్ధ సామాగ్రి, సైనికులు మరియు నిత్యావసర వస్తువులు ఎలాంటి అంతరాయం లేకుండా ఈశాన్య రాష్ట్రాలకు చేరుకుంటాయి. శత్రువుల డ్రోన్లకు గానీ, శాటిలైట్లకు గానీ చిక్కని ఈ ‘రక్షణ కవచం’ భారత సార్వభౌమాధికారాన్ని ఎల్లవేళలా కాపాడుతుంది.
ఇది కేవలం ఇంజనీరింగ్ అద్భుతం మాత్రమే కాదు.. మన దేశ రక్షణ కోసం రాయబడిన కొత్త చరిత్ర! కఠినమైన భూభాగం, భూకంప ముప్పు వంటి సవాళ్లను ఎదుర్కొని ‘బలమైన భారతాన్ని’ నిర్మించేందుకు భారతీయ ఇంజనీర్లు రంగంలోకి దిగారు.
ఈ ప్రాజెక్టు ఎందుకు అవసరం? ఈశాన్య రాష్ట్రాలను పశ్చిమ బెంగాల్ మీదుగా కలిపే ఏకైక మార్గం ఈ సిలిగురి కారిడార్. ఇది బంగ్లాదేశ్ సరిహద్దును ఆనుకుని ఉంటుంది. అందుకే ఈ ప్రాంతాన్ని దెబ్బతీసి ఈశాన్య రాష్ట్రాలను భారత్ నుండి వేరు చేస్తామంటూ బంగ్లాదేశ్ లోని కొన్ని శక్తులు రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నాయి. గత ఏడాది చైనా పర్యటనలో బంగ్లాదేశ్ మధ్యంతర ప్రభుత్వ ముఖ్య సలహాదారు మహమ్మద్ యూనస్ మాట్లాడుతూ.. బంగాళాఖాతానికి బంగ్లాదేశ్ ఏకైక రక్షకుడని, భారత ఈశాన్య రాష్ట్రాలు భూపరివేష్టిత ప్రాంతాలని వ్యాఖ్యానించారు. అంటే బంగ్లాదేశ్ సాయం లేకుండా భారత్ అక్కడ పట్టు సాధించలేదనేది ఆయన పరోక్ష ఉద్దేశం.
అంతేకాకుండా, రెండో ప్రపంచ యుద్ధం కాలం నాటి ఒక పాత విమానాశ్రయాన్ని పునరుద్ధరించి దానిని చైనాకు అప్పగించాలని బంగ్లాదేశ్ యోచిస్తున్నట్లు సమాచారం. ఇది జరిగితే మన దేశానికి చైనా, బంగ్లాదేశ్ నుండి పెద్ద ముప్పు ఏర్పడుతుంది. ఈ కుట్రలకు చెక్ పెట్టేందుకే కేంద్ర ప్రభుత్వం ఈ 40 కిలోమీటర్ల రైల్వే సొరంగ మార్గాన్ని అత్యంత వేగంగా నిర్మిస్తోంది.
