బీహార్ రాష్ట్రంలో సామూహిక అత్యాచారానికి గురైన 18 ఏళ్ల యువతిని, ఆమె తల్లిని పోలీస్ స్టేషన్ సరిహద్దు వివాదం పేరుతో రెండు ఠాణాల పోలీసులు 5 గంటల పాటు తిప్పించుకున్న అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది.
అనారోగ్యంతో ఉన్న తల్లికి చికిత్స అందించేందుకు సదర్ ఆసుపత్రికి వచ్చిన సమయంలోనే ఆ యువతికి ఈ దారుణం జరిగింది.
ఆసుపత్రి నుంచి బయటకు వచ్చినప్పుడు దారితప్పి నిర్మానుష్య ప్రాంతానికి చేరుకున్న ఆ యువతిపై ముగ్గురు దుండగులు మూకుమ్మడిగా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. రోడ్డుపై దిక్కుతోచని స్థితిలో పడివున్న ఆ బాధితురాలిని గమనించిన స్థానికులు.. డయల్ 112 పోలీసులకు సమాచారం అందించి, యువతిని రక్షించి కుటుంబసభ్యులకు అప్పగించారు.
ఆ తర్వాత న్యాయం కోసం బాజ్పట్టి పోలీస్ స్టేషన్కు వెళ్లిన తల్లీకూతుళ్లను, “ఇది నగర పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది” అంటూ అక్కడి పోలీసులు తిప్పి పంపించారు. తీరా వారు నగర పోలీస్ స్టేషన్కు వెళ్తే, “ఇది బాజ్పట్టి పరిధిలోకి వస్తుంది” అంటూ అక్కడి సిబ్బంది పట్టించుకోలేదు. దీంతో న్యాయం కోసం ఆ బాధితురాలు, ఆమె తల్లి కన్నీటిపర్యంతమవుతూ 5 గంటల పాటు రెండు పోలీస్ స్టేషన్ల మధ్య తీవ్ర మానసిక క్షోభతో తిరగాల్సి వచ్చింది.
ఈ నిర్లక్ష్య వైఖరిపై సమాచారం అందుకున్న సీతామర్హి జిల్లా ఎస్పీ అమిత్ రంజన్ తక్షణమే స్పందించి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ఆదేశాలతో నగర పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేసి, బాధితురాలికి వైద్య పరీక్షలతో పాటు చికిత్స అందించే ఏర్పాట్లు చేశారు.
ప్రస్తుతం సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్న పోలీసులు, ఈ దారుణానికి ఒడిగట్టిన ముగ్గురు గుర్తుతెలియని నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. ఆపదలో ఉన్న బాధితులకు తక్షణ న్యాయం చేయాల్సింది పోయి, పోలీస్ పరిధుల పేరుతో వారిని ముప్పుతిప్పలు పెట్టిన పోలీసుల తీరుపై తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి.

Leave a Reply