రాంచీ: నేటి డిజిటల్ మరియు ఆన్లైన్ బ్యాంకింగ్ సేవల నిబంధనలు, ఒక పేద కుటుంబం ప్రాణం తీసేంత క్రూరంగా ఎలా మారుతాయనడానికి నిదర్శనంగా జార్ఖండ్ రాష్ట్రంలో గుండెలను పిండేసే ఒక విషాద సంఘటన జరిగింది.
జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన భవ్యా లక్రా అనే గిరిజన మహిళ, టీబీ (క్షయ) వ్యాధితో ప్రాణాలతో పోరాడుతున్న తన మామ రతన్ లక్రా చికిత్స కోసం, ఆయన పెన్షన్ ఖాతాలో ఉన్న కేవలం ₹8,000 డబ్బును విత్‌డ్రా చేసుకోలేక గత కొన్ని నెలలుగా ఆ ప్రాంతంలోని బ్యాంక్ చుట్టూ తిరిగి విసిగిపోయింది.
అకౌంట్ బ్లాక్ అవ్వడంతో ‘ఈ-కేవైసీ’ (e-KYC) చేయాలని చెప్తూ, అక్కడి సిబ్బంది ఆ మహిళను అవమానించినట్లు తెలుస్తోంది. మామను అంబులెన్స్‌లో ఆసుపత్రికి తీసుకెళ్లడానికి డబ్బులు లేకపోవడంతో, ఆటోలోనే ఆయనను నేరుగా బ్యాంకుకు తీసుకువచ్చి మేనేజర్‌ను బ్రతిమిలాడింది ఆ మహిళ.
కానీ, “సార్ మీటింగ్‌లో ఉన్నారు, గొడవ చేయకండి” అంటూ సిబ్బంది ఆమెను తరిమేశారు. చివరికి, సరైన సమయానికి చికిత్సకు డబ్బు అందక ఆ వృద్ధుడు పాపం కన్నుమూశాడు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కుటుంబ సభ్యులు, వృద్ధుడి మృతదేహాన్ని బ్యాంక్ బ్రాంచ్ ముందే ఉంచి నిరసనకు దిగారు.
ఈ ఉదంతం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ వెంటనే స్పందించి, సంబంధిత బ్యాంక్ సిబ్బందిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని, ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు.
