డైమండ్ కింగ్ సావ్జీ ధోలాకియా: సాధారణంగా ఉద్యోగులు తమ బాస్ పట్ల అసంతృప్తిగా ఉంటారు. పని ఒత్తిడి లేదా తక్కువ జీతాల పెంపు దీనికి కారణం కావచ్చు. యజమానులు తమ లాభాలను ఆస్తులు పెంచుకోవడానికే వాడుతారని అందరూ భావిస్తారు. కానీ ఒక బాస్ మాత్రం తన లాభాలను తన ఉద్యోగులతో పంచుకుంటారు.
దీపావళి అయినా, కొత్త ఏడాది అయినా తన కంపెనీ ఉద్యోగులకు ఫ్లాట్లు, కార్లు, భారీ బోనస్‌లు లేదా ఖరీదైన బహుమతులు పంపిణీ చేయడంలో ఆయన ప్రపంచ ప్రఖ్యాతి గాంచారు. కేవలం 12 రూపాయలతో సూరత్ వచ్చి, తన కష్టంతో 15,000 కోట్ల రూపాయల సామ్రాజ్యాన్ని నిర్మించిన వ్యక్తి కథ ఇది. తన కొడుకుకు ‘వెండి స్పూన్’తో తినిపించే బదులు, ఒక సామాన్య కూలీ జీవితం ఎలా ఉంటుందో అనుభవించమని నేర్పిన గొప్ప వ్యాపారవేత్త కథ ఇది. ఆయనే గుజరాత్ డైమండ్ కింగ్ సావ్జీ ధోలాకియా.
12 ఏళ్ల వయసులో ₹12లతో సూరత్ వచ్చి.. డైమండ్ కింగ్‌గా ఎదిగి: సౌరాష్ట్రలోని అమ్రేలి జిల్లా దుధాలా గ్రామానికి చెందిన సావ్జీ ధోలాకియా, కేవలం 12 ఏళ్ల వయసులో సూరత్ చేరుకున్నారు. జేబులో కేవలం 12 రూపాయలు మాత్రమే ఉన్నాయి. అక్కడ వజ్రాలను పాలిష్ చేసే పనిలో చేరిన ఆయనకు నెలకు ₹180 జీతం వచ్చేది. చాలా ఏళ్ల పాటు అదే పని చేసి, అనుభవం గడించిన తర్వాత తన బాబాయ్ దగ్గర అప్పు తీసుకుని చిన్న వ్యాపారం ప్రారంభించారు. 1992లో ‘హరికృష్ణ ఎక్స్‌పోర్ట్స్’ పేరుతో కంపెనీని స్థాపించారు. క్రమంగా వ్యాపారం విస్తరించి భారీ స్థాయికి చేరుకుంది.
₹15,000 కోట్ల కంపెనీ వారసుడు.. కానీ చేసినది కూలీ పని: నేడు సావ్జీ ధోలాకియా కంపెనీ ₹15,000 కోట్ల సామ్రాజ్యంగా మారింది. 50 ఎకరాల్లో విస్తరించిన అతిపెద్ద ఇంట్లో ఆయన కుటుంబంలోని 64 మంది సభ్యులు కలిసి నివసిస్తున్నారు. సకల సౌకర్యాలు ఉన్నప్పటికీ, ఆయన తన కుమారుడు ద్రవ్య ధోలాకియాను నేరుగా కంపెనీలో చేర్చుకోలేదు.
₹7,000 జీతం, బేకరీలో పని: తన కుమారుడికి జీవిత సత్యాలు తెలియాలని సావ్జీ ఒక కఠిన నిర్ణయం తీసుకున్నారు. ద్రవ్య ఎంబీఏ (MBA) పూర్తి చేసినప్పటికీ, ఇంటికి దూరంగా, గుజరాత్ వదిలి కేరళకు వెళ్లమని చెప్పారు. తన గుర్తింపు దాచిపెట్టి సొంత కాళ్లపై నిలబడమని ఆదేశించారు. కోటీశ్వరుడి కుమారుడైన ద్రవ్య కేరళలో ఎవరికీ తెలియకుండా ఒక సాధారణ కూలీలా పనిచేశారు. కొన్ని రోజులు బేకరీలో, మరికొన్ని రోజులు బట్టల దుకాణంలో పని చేస్తూ నెలకు ₹7,000 సంపాదించారు. జీవితం అంటే ఏమిటో, ఇతరుల కష్టాలేమిటో తెలిస్తేనే భవిష్యత్తులో కంపెనీ ఉద్యోగులను గౌరవంగా చూసుకుంటాడని సావ్జీ ఇలా చేశారు.
