తమిళనాడు , కళ్ళకురిచ్చి: ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. ముగ్గురు పిల్లలకు తండ్రి అయ్యాడు.. కానీ భార్య పరాయి వ్యక్తి మోజులో పడిందని తెలిసినా, ఆమెను మార్చుకోవాలని ప్రయత్నించాడు. చివరకు ఆ ప్రయత్నమే అతని పాలిట శాపమైంది. కళ్ళకురిచ్చిలో జరిగిన ఈ అమానుష ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.
ఏం జరిగిందంటే?
కళ్ళకురిచ్చి సమీపంలోని కె.మామందల్ గ్రామానికి చెందిన ఆంథోనీ రాబిన్ (26) ప్రైవేట్ గ్యాస్ కంపెనీలో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఇతనికి అమ్మూ (22)తో ఎనిమిదేళ్ల క్రితం ప్రేమ వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయితే, కొంతకాలంగా అమ్మూకు ఆమె అక్క భర్తతో (బావ) అక్రమ సంబంధం ఏర్పడింది. ఈ విషయం తెలుసుకున్న ఆంథోనీ భార్యను గట్టిగా మందలించాడు. దీంతో భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి.
నిద్రపోతున్న భర్తపై పెట్రోల్ పోసి..
ఈ నెల 8వ తేదీన ఆంథోనీ మద్యం మత్తులో ఇంటికి వచ్చి భార్యతో గొడవ పడ్డాడు. ఆపై నిద్రపోయాడు. తన అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడన్న కోపంతో అమ్మూ అతన్ని అంతం చేయాలని నిర్ణయించుకుంది. ఇంట్లో ఉన్న పెట్రోల్‌ను నిద్రిస్తున్న భర్తపై పోసింది. మంటలు అంటుకోకముందే మేల్కొన్న ఆంథోనీ ప్రాణభయంతో రోడ్డుపైకి పరుగెత్తాడు.
సినిమాను మించిన విలన్.. వెంటాడి మరీ నిప్పు!
ఆంథోనీ రోడ్డుపైకి వెళ్లినా అమ్మూ వదల్లేదు. అతని వెంటే వెళ్లి అందరూ చూస్తుండగానే నిప్పంటించింది. ఆ మంటల్లో ఆంథోనీ విలవిల్లాడుతుంటే, అతను స్వయంగా పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని అందరినీ నమ్మించి ఆస్పత్రిలో చేర్పించింది. చికిత్స పొందుతూ ఆంథోనీ మరణించాడు.
పోలీసుల విచారణలో అసలు రంగు బయటపడింది
ఆంథోనీ మరణంపై అనుమానం ఉన్న అతని బంధువులు ఆందోళన చేయడంతో పోలీసులు అమ్మూను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించారు. మొదట బుకాయించినప్పటికీ, చివరకు తానే చంపినట్లు అంగీకరించింది.
“మా అక్క భర్తతో నాకు ఉన్న సంబంధాన్ని అతను వ్యతిరేకించాడు. అందుకే ఇంట్లో పెట్రోల్ పోసి, అతను బయటకు పారిపోయినా వెంటాడి మరీ నిప్పంటించాను” అని ఆమె ఒప్పుకోవడంతో పోలీసులు దిగ్భ్రాంతికి గురయ్యారు.
