బెంగళూరు: ఒకరి గుర్తింపును (Identity) మరొకరు దొంగిలించి జీవించడం అనే కాన్సెప్ట్‌తో ఇప్పటివరకు పలు సినిమాలు వచ్చాయి. తెలుగు సినిమా ‘అతడు’లో కథానాయకుడు మహేష్ బాబు పోలీసుల నుండి తప్పించుకోవడానికి, చనిపోయిన ఒక వ్యక్తి గుర్తింపును వాడుకుని అతని ఇంటికి వెళ్తాడు.
అలాగే ‘త్రీ ఇడియట్స్’ సినిమాలో అమీర్ ఖాన్ తన యజమాని కొడుకు పేరు, డిగ్రీ సర్టిఫికెట్లను ఉపయోగించుకుని ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతాడు. సరిగ్గా ఇలాంటి ఘటనే బెంగళూరులో (Bengaluru) నిజంగా జరిగింది. దాదాపు 40 ఏళ్ల తర్వాత ఈ బండారం బయటపడింది. సినిమా శైలిలో సాగిన ఈ మహా వంచన కేసు ప్రస్తుతం రాజాజీనగర్ పోలీస్ స్టేషన్‌కు చేరడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ఫ్లిష్బ్యాక్: పడిపోయిన సర్టిఫికెట్.. మారిన తలరాత!
ఈ అసలు కథ 1982లో ప్రారంభమైంది. మాండ్య జిల్లా మళవల్లికి చెందిన ఎం. రాచయ్య అనే యువకుడు శివమొగ్గలోని కర్ణాటక విద్యుత్ బోర్డులో ‘గ్యాంగ్‌మ్యాన్’ ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకి వెళ్లాడు. అయితే కొన్ని కారణాల వల్ల ఆ రోజు ఇంటర్వ్యూ రద్దయింది. తీవ్ర నిరాశతో వెనుతిరుగుతున్న సమయంలో రాచయ్య తన మార్క్స్ కార్డ్, ఒరిజినల్ సర్టిఫికెట్లను అక్కడే పారేసుకున్నాడు. కథలో ట్విస్ట్ ఏంటంటే.. అదే ఇంటర్వ్యూకి వచ్చిన హాసన్ జిల్లాకు చెందిన బొమ్మేగౌడ చేతికి ఈ పత్రాలు దొరికాయి. అంతే, బొమ్మేగౌడ తనే ‘రాచయ్య’నంటూ నకిలీ గుర్తింపును సృష్టించి, ఆ సర్టిఫికెట్లతో ప్రభుత్వ ఉద్యోగం సంపాదించేశాడు!
జీతం అందుకుంటూ.. కోర్టులోనే ఊహించని ట్విస్ట్!
అసలైన రాಚయ్య ఎక్కడో రోజువారీ కూలీ పనులు చేసుకుంటూ బతుకుతుంటే, ఇటు నకిలీ రాచయ్య (బొమ్మేగౌడ) మాత్రం బెస్క్యాం (BESCOM – బెంగళూరు విద్యుత్ సరఫరా సంస్థ) లో హాయిగా ప్రభుత్వ జీతం అందుకుంటూ ప్రమోషన్లు కూడా పొందాడు. అయితే కథలోకి మరో రోచకమైన మలుపు 2003లో వచ్చింది. ఇన్నేళ్లు రాచయ్యగా బతికిన బొమ్మేగౌడ, కోర్టు నుండి ఒక అఫిడవిట్ తెచ్చుకుని అధికారికంగా తన పేరును తిరిగి ‘బొమ్మేగౌడ’గా మార్చుకున్నాడు! ఇలా డిపార్ట్మెంట్ కళ్లు గప్పి దశాబ్దాల పాటు ఈ రహస్యాన్ని కాపాడుకుంటూ వచ్చాడు.
బ్లాక్మెయిల్, రాజీ మరియు ఫ్లాప్ క్లైమాక్స్
దాదాపు 37 ఏళ్ల తర్వాత, అంటే 2019లో అసలైన రాచయ్యకు తన పేరుతో బొమ్మేగౌడ బెస్క్యాంలో సీనియర్ మెకానిక్‌గా పనిచేస్తున్నాడనే చేదు నిజం తెలిసింది. జైలుకు పంపుతానని బెదిరించడంతో భయపడిపోయిన బొమ్మేగౌడ, ఏడాదికి రూ. 2 నుండి 3 లక్షలు ఇస్తానని రాచయ్యతో రాజీ కుదుర్చుకున్నాడు. 2022లో రిటైర్ అయినప్పుడు వచ్చిన సెటిల్మెంట్ డబ్బులో ఏకంగా రూ. 10 లక్షలను సుభాష్ అనే రిటైర్డ్ ఇంజనీర్ మధ్యవర్తిత్వంతో అసలు రాచయ్యకు అందజేశాడు.
కానీ, అత్యాశే ఈ రియల్ సినిమా క్లైమాక్స్‌ను రివర్స్ చేసింది. పది లక్షల రూపాయలు జేబులో వేసుకున్న తర్వాత కూడా అసలు రాచయ్య.. బొమ్మేగౌడకు వచ్చే పెన్షన్‌లో సగం వాటా కావాలని పట్టుబట్టాడు. ఇందుకు బొమ్మేగౌడ నిరాకరించడంతో, కోపంతో రాచయ్య బెస్క్యాం విజిలెన్స్ విభాగానికి ఫిర్యాదు చేశాడు. విచారణలో మోసం జరిగినట్లు రుజువు కావడంతో రాజాజీనగర్ పోలీసులు బొమ్మేగౌడ, అసలు రాచయ్య మరియు మధ్యవర్తిత్వం వహించిన సుభాష్‌లపై క్రిమినల్ కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 40 ఏళ్ల పాటు సాగిన ఈ హైటెక్ మోసం ఆట చివరకు జైలు కటకటాల వెనుక ముగిసే దశకు చేరుకుంది.
