హైదరాబాద్‌లో ‘కుబేర’ సినిమా చూడటానికి వెళ్లిన ఓ ప్రేక్షకుడు, సినిమా ప్రారంభం కావడానికి ముందు 20 నిమిషాలకు పైగా వాణిజ్య ప్రకటనలు (యాడ్స్) ప్రదర్శించారంటూ వినియోగదారుల కోర్టులో ఫిర్యాదు చేశారు.
జూన్ 20, 2025న రాత్రి 10.35 గంటల షో కోసం ఆయన రెండు టికెట్లు బుక్ చేసుకున్నారు.
ఫిర్యాదుదారుడి వివరాల ప్రకారం.. రాత్రి 10.30 గంటలకే థియేటర్‌లో తన సీట్లో కూర్చోగా, అప్పటి నుంచి యాడ్స్, సినిమాల ట్రైలర్లు వరుసగా ప్రదర్శించారు. దీంతో సినిమా రాత్రి 10.52 గంటలకు గానీ ప్రారంభం కాలేదు. దీనివల్ల దాదాపు 22 నిమిషాల ఆలస్యం జరిగిందని ఆయన పేర్కొన్నారు.
ఈ అధిక ప్రకటనల వల్ల తన విలువైన సమయం వృథా అవ్వడమే కాకుండా, తన షెడ్యూల్ కూడా దెబ్బతిన్నదని ఆయన వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన హైదరాబాద్ జిల్లా వినియోగదారుల కమిషన్, వాణిజ్య ప్రకటనల వల్ల సినిమా ఆలస్యంగా వేయడం సేవా లోపమేనని, ఇది ముమ్మాటికీ అన్యాయమైన వ్యాపార విధానమేనని తేల్చి చెప్పింది.
దీంతో సదరు థియేటర్ యాజమాన్యం మొత్తం రూ.75,000 చెల్లించాలని ఆదేశించింది. ఇందులో ఫిర్యాదుదారుడికి కలిగిన అసౌకర్యానికి గాను రూ.20,000 పరిహారం, కోర్టు ఖర్చుల కింద రూ.5,000 చెల్లించాలని పేర్కొంది. అంతేకాకుండా, మరో రూ.50,000 జిల్లా వినియోగదారుల సంక్షేమ నిధిలో జమ చేయాలని కమిషన్ ఆదేశించింది. థియేటర్లు పరిమితికి మించి ప్రకటనలు వేయకుండా నిబంధనలను కచ్చితంగా పాటించాలని ఈ సందర్భంగా కమిషన్ స్పష్టం చేసింది.

Leave a Reply