బీహార్‌లో ‘దృశ్యం’ సినిమాను చూసి, అందులోని సన్నివేశాల తరహాలో ప్లాన్ చేసి తన తండ్రిని హత్య చేశాడనే ఆరోపణలు ఓ కుమారుడిపై వచ్చాయి.
సమస్తిపూర్ ప్రాంతంలో జరిగిన ఈ ఘటన పోలీసులను సైతం దిగ్భ్రాంతికి గురిచేసింది. సుమారు 2,000 కి.మీ. దూరంలో ఉన్న సూరత్ నుంచి కొడుకు తన తండ్రిని హత్య చేయాలనే ఉద్దేశ్యంతో వచ్చినట్లు సమాచారం. దీనికోసం ముందుగానే పక్కా స్కెచ్ వేసిన అతను, హత్య చేసిన తర్వాత పోలీసులకు ఎలాంటి అనుమానం రాకుండా వెంటనే తిరిగి సూరత్‌కు వెళ్లిపోయినట్లు పోలీసుల విచారణలో తేలింది.
తండ్రిని హత్య చేసేందుకు కొడుకు ఇంత దూరం ప్రయాణించి రావడంపై పోలీసులకు అనుమానం వచ్చింది. ‘దృశ్యం’ సినిమాలో నేరాన్ని దాచేందుకు పాత్రలు ప్లాన్ చేసినట్లుగానే, ఈ ఘటనలోనూ హత్య తర్వాత జరగాల్సిన పరిణామాలను ముందుగానే ప్లాన్ చేసినట్లు విచారణలో వెల్లడైనట్లు తెలుస్తోంది. తండ్రి హత్య తర్వాత రాత్రికి రాత్రే తిరిగి వెళ్లిపోవడం ఈ కేసులో కీలక మలుపుగా మారింది. దీంతో పోలీసులు ఆ యువకుడి ప్రయాణం, కాల్ డేటా, హత్యకు ముందు జరిగిన సంఘటనలపై తీవ్రంగా దర్యాప్తు చేస్తున్నారు.
హత్య జరిగిన తీరు, అంతకుముందు చేసుకున్న ఏర్పాట్లపై పోలీసులు వరుసగా ఆధారాలు సేకరిస్తున్నారు. ముఖ్యంగా, సుమారు 2,000 కి.మీ. దూరం నుంచి వచ్చిన వ్యక్తి ఈ హత్య ప్లాన్‌ను ఎలా అమలు చేశాడు? అతనికి ఎవరెవరు సహకరించారు? ఘటన తర్వాత ఎలాంటి ఆధారాలు దొరకకుండా ఎలా తిరిగి వెళ్లిపోయాడు? అనే కోణంలో విచారణ కొనసాగుతోంది. ‘దృశ్యం’ సినిమా స్ఫూర్తితోనే ఈ ప్లాన్ వేశాడా అనే కోణంలో కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు.
ఈ కేసులో బయటపడుతున్న ఒక్కో విషయం ఈ ఘటన వెనుక ఉన్న అసలు కథపై కొత్త అనుమానాలకు తావిస్తోంది. తండ్రిని చంపేందుకు కొడుకు ఇంత దూరం ఎందుకు ప్రయాణించాడు? ఈ హత్య వెనుక ఇంకా ఏమైనా ఇతర కారణాలు లేదా వ్యక్తులు ఉన్నారా? అనేది విచారణలో కీలకంగా మారింది. సినిమాలో చూసిన సన్నివేశాల తరహాలో నేరాన్ని కప్పిపుచ్చేందుకు ప్రయత్నించాడని చెబుతున్న ఈ ఘటన ప్రస్తుతం ఆ ప్రాంతంలో తీవ్ర కలకలం సృష్టిస్తోంది.

Leave a Reply