మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో తీవ్ర కలకలం రేపిన తండ్రీకూతుళ్ల జంట హత్యల కేసులో, 28 ఏళ్ల క్రితం దత్తత తీసుకున్న కొడుకే హంతకుడనే సంచలన విషయం వెలుగులోకి వచ్చింది.
కలానీ నగర్‌కు చెందిన రాజు యాదవ్, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న తనకు తెలిసిన ఓ కుటుంబం నుంచి 28 ఏళ్ల క్రితం హర్ష్ యాదవ్‌ను దత్తత తీసుకుని సొంత కొడుకులా పెంచారు. అయితే, ఇటీవల రాజు యాదవ్ తన ఇంటిని రూ.50 లక్షలకు అమ్మగా, అందులో రూ.25 లక్షలను కూతురు హర్షిత పేరు మీద ప్లాట్ కొనడానికి ఇచ్చి, మిగిలిన డబ్బును తన వద్దే ఉంచుకున్నారు. దీంతో ఆగ్రహానికి గురైన హర్ష్ ఆస్తి తగాదాతో ఇద్దరినీ హతమార్చాడు.
పోలీసుల విచారణ ప్రకారం, హర్షిత హత్యకు గురవడానికి రెండు రోజుల ముందే ఆమె తండ్రి రాజు యాదవ్ అద్దె ఇంట్లో పదునైన ఆయుధంతో హత్య చేయబడ్డారు. హత్య అనంతరం హర్ష్, అతని 17 ఏళ్ల మైనర్ సహచరుడు కలిసి రాజు యాదవ్ మృతదేహాన్ని బట్టలో చుట్టి, సుమారు 10 కిలోమీటర్ల దూరంలోని ఓ చిన్న వంతెన వద్ద చెత్తలో పడేశారు. శుక్రవారం రాత్రి ఎడమ చేయి నరికివేసిన స్థితిలో ఉన్న రాజు యాదవ్ మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
తండ్రి హత్యకు గురైన విషయం తెలియని కూతురు హర్షిత, నవంబర్ 18వ తేదీ రాత్రి నుంచి మరుసటి రోజు తెల్లవారుజామున 4 గంటల వరకు తన తండ్రికి నిరంతరం ఫోన్ చేస్తూనే ఉంది. సరిగ్గా రెండు గంటల తర్వాత, నవంబర్ 19న ఉదయం 6:16 గంటలకు హర్ష్ తన 17 ఏళ్ల స్నేహితురాలితో కలిసి ఇంటికి వచ్చి, తలుపు తెరవగానే హర్షితపై దాడి చేసి, దుపట్టాతో గొంతు నులిమి హత్య చేశాడు.
హత్య జరిగినప్పుడు హర్షిత ప్రాణాలు కాపాడుకోవడానికి 40 సెకన్ల పాటు కేకలు వేసిన శబ్దం అక్కడున్న సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. ఉదయం 6:17 గంటలకు ఇంట్లోకి ప్రవేశించిన హర్ష్, అతని సహచరి హత్యను పూర్తి చేసి 6:20 గంటలకు అక్కడి నుంచి పారిపోయిన దృశ్యాలు కూడా సీసీటీవీలో చిక్కాయి.
దత్తత తీసుకుని పెంచిన తండ్రిని, తోడబుట్టిన సోదరిలా ఉన్న యువతిని డబ్బు కోసం కిరాతకంగా హత్య చేసిన హర్ష్ చర్య ఆ ప్రాంతంలో తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. సీసీటీవీ దృశ్యాలు, ఫోన్ కాల్ వివరాల ఆధారంగా పోలీసులు ఈ జంట హత్యల కేసును అన్ని కోణాల్లోనూ ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply