పంజాబ్ రాష్ట్రం కపుర్తలాలో ప్రభుత్వ వైద్యురాలిగా సేవలందిస్తున్న డాక్టర్ మీనాక్షి సూద్, జలంధర్‌లోని తన నివాసంలో మృతి చెంది ఉండటం గమనార్హం.
ఆమె మరణం వెనుక పలు అనుమానాలు ఉన్నాయని పేర్కొంటూ.. ఆమె భర్త డాక్టర్ పియూష్ సూద్‌పై గృహ హింస, ఆర్థిక మోసాలు మరియు వివాహేతర సంబంధం వంటి తీవ్రమైన ఆరోపణలను మీనాక్షి కుటుంబ సభ్యులు గుప్పించారు. దీనిపై ఆమె తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు భారతీయ న్యాయ సంహిత (BNS) లోని సెక్షన్ 106 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
2018లో వివాహం చేసుకున్న ఈ దంపతులు, మనస్పర్థల కారణంగా 2025 జూలై నుండి విడిగా నివసిస్తున్నారు. మీనాక్షికి తెలియకుండానే ఆమె పేరిట కారు మరియు ఆసుపత్రి అవసరాల కోసం పియూష్ దాదాపు ₹45 లక్షల వరకు రుణం (లోన్) తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల సొంతంగా ఒక ఇల్లు కొనుగోలు చేయడానికి బ్యాంకుకు వెళ్లిన మీనాక్షి.. తన నకిలీ సంతకంతో (ఫోర్జరీ) తన పేరిట ఏకంగా రూ. 2.5 కోట్ల అప్పు ఉన్నట్లు తెలుసుకుని తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. దీనికి తోడు, పియూష్ తన ఆసుపత్రి సిబ్బందిలో ఒకరితో అక్రమ సంబంధం పెట్టుకున్న విషయాన్ని సీసీటీవీ ఫుటేజీల ద్వారా మీనాక్షి కనిపెట్టింది. ఈ క్రమంలో ఆమె ఎదుర్కొన్న తీవ్ర మానసిక క్షోభే ఈ విపత్కర స్థితికి కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
బుధవారం ఉదయం తాళం వేసి ఉన్న ఇంటి తలుపులు పగలగొట్టి లోపలికి ప్రవేశించిన పోలీసులు, మీనాక్షి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిగా భావిస్తున్న భర్త పియూష్ మొబైల్ ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి ఉండటంతో పోలీసులు అతడిని ఇంకా విచారించలేదు. ఇదిలా ఉండగా, పియూష్ మరో మహిళతో సన్నిహితంగా ఉన్న సీసీటీవీ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నప్పటికీ, వాటి ప్రామాణికతను పోలీసులు ఇంకా ధృవీకరించలేదు. మీనాక్షి మరణానికి గల అసలు కారణాలు శవపరీక్ష (Post-mortem) నివేదిక వచ్చిన తర్వాతే స్పష్టమవుతాయని పోలీసు వర్గాలు వెల్లడించాయి.

Leave a Reply