“కాలం నిర్ణయించేసింది.. దేవుడు నిర్ణయించేసాడు.. సూర్య ప్రజా నాయకుడిగా రాకుండా ఎవరూ ఆపలేరు” అని ఒక ఫ్యాన్ క్లబ్ నిర్వాహకుడు చేసిన వ్యాఖ్యల తర్వాత, నటుడు సూర్య రాజకీయాల్లోకి రాబోతున్నారని సోషల్ మీడియాలో గత కొద్ది రోజులుగా వార్తలు హల్చల్ చేస్తున్నాయి. దీనిపై సూర్య బృందం తాజాగా స్పష్టతనిచ్చి పుకార్లకు చెక్ పెట్టింది.
తమిళ చిత్ర పరిశ్రమలో అగ్రనటుల్లో ఒకరైన సూర్య, తన నటనతోనే కాకుండా సామాజిక సేవలతోనూ ప్రత్యేక గుర్తింపు పొందారు. ‘అగరం’ ఫౌండేషన్ ద్వారా ఎంతోమంది పేద విద్యార్థుల చదువుకు సాయం చేస్తున్నారు. ఈ క్రమంలో, నిన్న చెన్నైలో జరిగిన ‘ఆల్ ఇండియా సూర్య హెడ్ క్వార్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్’ సమావేశంలో పాల్గొన్న ప్రత్యేక అతిథి వీరమణి, “కాలం నిర్ణయించేసింది, సూర్య ప్రజా నాయకుడిగా రాకుండా ఎవరూ ఆపలేరు” అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో, సూర్య త్వరలోనే రాజకీయాల్లోకి వస్తున్నారని ఊహాగానాలు మొదలయ్యాయి.
ఈ ప్రచారానికి ఫుల్స్టాప్ పెడుతూ, సూర్య వెల్ఫేర్ అసోసియేషన్ వివరణాత్మక ప్రకటన విడుదల చేసింది. వీరమణి చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగత అభిప్రాయమని, వాటిని వెల్ఫేర్ అసోసియేషన్ యొక్క అధికారిక వైఖరిగా భావించవద్దని స్పష్టం చేసింది. గత మూడేళ్లుగా వీరమణికి వెల్ఫేర్ అసోసియేషన్ నిర్వహణతో ఎటువంటి సంబంధం లేదని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
ముఖ్యంగా, నటుడు సూర్యకు రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన గానీ, ప్రణాళిక గానీ లేదని అసోసియేషన్ స్పష్టం చేసింది. అగరం ఫౌండేషన్ మరియు వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా సామాజిక సేవలు కొనసాగించడంలోనే సూర్య ఎంతో సంతృప్తిగా ఉన్నారని, ప్రస్తుతం తన పూర్తి దృష్టి దానిపైనే ఉందని వివరించారు. సోషల్ మీడియాలో వచ్చే పుకార్లను నమ్మవద్దని, అధికారిక ప్రకటనలను మాత్రమే అనుసరించాలని అభిమానులను, ప్రజలను వారు కోరారు.
