దిండిగల్ జిల్లా నాథమ్, దాని పరిసర గ్రామాలైన కాశంపట్టి, విళాంపట్టి, పుదుక్కోట్టై, ఉసిలంపట్టిలలో ‘FQL Exchange’, ‘VG Investment’ వంటి నకిలీ ఆన్లైన్ యాప్‌ల ద్వారా భారీ ఆర్థిక మోసం వెలుగుచూసింది.
క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్‌లో రూ. 50,000 పెట్టుబడి పెడితే, కేవలం రెండు నెలల్లోనే రెట్టింపు చేసి ఇస్తామని నమ్మబలికారు. ఈ మోసపూరిత మాటలు నమ్మి దాదాపు 15,000 మందికి పైగా పేదలు, రైతులు తమ జీవితకాల పొదుపు మొత్తమైన రూ. 30 కోట్లకు పైగా నష్టపోయి రోడ్డున పడ్డారు.
ఈ మోసంపై కాశంపట్టికి చెందిన ఇళయరాజా ఇచ్చిన ఫిర్యాదు మేరకు దిండిగల్ జిల్లా ఎస్పీ జయకుమార్ ఆదేశాలతో క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. డీఎస్పీ కుమరేశన్, ఇన్స్పెక్టర్ ముత్తమిళ్సెల్వి నేతృత్వంలోని ప్రత్యేక బృందం ఈ మోసంలో కీలక ఏజెంట్లుగా వ్యవహరించిన కాశంపట్టికి చెందిన రమేష్, అతని భార్య అనిత, విజయ్‌లను అరెస్ట్ చేసి మధురై సెంట్రల్ జైలుకు తరలించారు. పరారీలో ఉన్న దీనదయాళన్, ప్రియదర్శిని, రంజిత్, అరుణ్‌ల కోసం గాలింపు ముమ్మరం చేశారు.
ఈ క్రమంలో అరెస్టయిన ఏజెంట్ రమేష్ ఇంటి సెప్టిక్ ట్యాంక్‌లో కోట్ల రూపాయల నగదు దాచిపెట్టారన్న ప్రచారం స్థానికంగా దావానలంలా వ్యాపించింది. దీంతో బాధితులు పెద్ద ఎత్తున రమేష్ ఇంటిని ముట్టడించి, సెప్టిక్ ట్యాంక్‌ను తవ్వి తీయాలని డిమాండ్ చేశారు. అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో నాథమ్ పోలీసులు రంగప్రవేశం చేసి ప్రజలకు నచ్చజెప్పి, వారి సమక్షంలోనే సెప్టిక్ ట్యాంక్‌ను తవ్వి తనిఖీలు చేపట్టారు.
అయితే, ఆ సెప్టిక్ ట్యాంక్‌లో దుర్వాసనతో కూడిన రాళ్లు, ఇసుక మాత్రమే లభించాయి; ఎలాంటి నగదు దొరకలేదు. దీంతో తమ డబ్బు రికవరీ అవుతుందని ఆశగా వచ్చిన బాధితులు తీవ్ర నిరాశతో వెనుదిరిగారు. తమిళనాడు వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన ఈ నకిలీ క్రిప్టో కరెన్సీ మోసంపై ఇప్పటివరకు 10,000 మందికి పైగా ఫిర్యాదు చేయగా, మొత్తం మోసం విలువ రూ. 1,000 కోట్లు దాటే అవకాశం ఉందని భావిస్తున్నారు.

Leave a Reply