రాజస్థాన్ రాష్ట్రం ఉదయ్‌పూర్‌లో లైవ్ స్ట్రీమ్ (ప్రత్యక్ష ప్రసారం) చేస్తున్న థాయ్-ఫ్రెంచ్ దేశానికి చెందిన మహిళా యూట్యూబర్‌తో ఒక వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించిన ఘటన సోషల్ మీడియాలో తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
‘జస్ట్ కెత్’ (Justketh) అనే ఆ మహిళా క్రియేటర్ రాత్రి సమయంలో బహిరంగ ప్రదేశంలో లైవ్ చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. అప్పుడు అక్కడికి వచ్చిన ఒక వ్యక్తి, ఫోటో అడగకుండా.. ఏకంగా పెదాలపై ముద్దు కావాలని అసభ్యకరంగా అడుగుతూ వేధింపులకు గురిచేశాడు.
దీంతో తీవ్ర ఇబ్బందికి గురైన ఆ మహిళ, వెంటనే ఆ వ్యక్తి కోరికను నిర్మొహమాటంగా తిరస్కరించింది. అయినప్పటికీ ఆ వ్యక్తి పదే పదే వదలకుండా అడగడంతో, ఆమె తప్పనిసరి పరిస్థితుల్లో ఎంతో ఇబ్బంది పడుతూ చివరకు అతనితో ఒక ఫోటో దిగడానికి మాత్రమే అంగీకరించింది.
ఈ వీడియో సోషల్ మీడియాలో వేగంగా వ్యాపించడంతో, ఆ వ్యక్తి నీచమైన ప్రవర్తనపై నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. విదేశీ మహిళతో బహిరంగ ప్రదేశంలో ఈ విధంగా ప్రవర్తించిన తీరు చూసి పలువురు తమ దిగ్భ్రాంతిని, విచారాన్ని వ్యక్తం చేశారు.
బహిరంగ ప్రదేశాల్లో మహిళలపై జరుగుతున్న ఇలాంటి వేధింపుల గురించి ఇంటర్నెట్లో పలువురు చర్చిస్తుండటంతో పాటు, ఆ విదేశీ మహిళకు ఎదురైన ఈ చేదు అనుభవానికి తమ విచారం వ్యక్తం చేస్తూ ఆమెకు అండగా నిలుస్తున్నారు.

Leave a Reply